
స్పెయిన్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో 210 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది జాడ తెలియకుండా పోయారు. ఒక్క వలెన్సియాలోనే 155 మంది చనిపోయారు. సునామీ స్థాయిలో సంభవించిన తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే. ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక పనులకు చేపట్టింది. వేలాదిగా ఆర్మీని రంగంలోకి దించింది. వరదలతో దెబ్బతిన్న వలెన్సియా నగర వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న ప్రజలు..
సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ స్వచ్ఛందంగా తరలివచ్చిన వారితో శుక్రవారం వలెన్సియాలోని సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కల్చరల్ కాంప్లెక్స్ ఆవరణ కిక్కిరిసిపోయిందిలా..!
స్పెయిన్‌ను వణికించిన వరదలు
భారీ వర్షంతో ఆకస్మికంగా సంభవించిన వరదలతో స్పెయిన్ అతలాకుతలమైంది. తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షాలు పడటంతో వరదలు వచ్చాయి. తద్వారా భారీ సంఖ్యలో కుటుంబాలు వీధిన పడ్డాయి. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.
ఆకస్మిక భారీ వరదలకు మృత్యువాత పడ్డ వారి సంఖ్య 210కి చేరింది. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీయగా, శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు.. గల్లంతు అయిన వారి కోసం బంధువులు పడే ఆందోళనలతో ఎక్కడ చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి.