ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలు కష్టమే | H1B visas are difficult to get this year | Sakshi
Sakshi News home page

H1B Visa: ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలు కష్టమే

Mar 10 2025 5:15 AM | Updated on Mar 10 2025 4:30 PM

H1B visas are difficult to get this year

85,000 మందికి మించి ఇవ్వకూడదని అమెరికా నిర్ణయం

మార్చి7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగింపు 

4,23,028 మందిలో 20% మందికే దక్కనున్న వీసాలు

సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్‌ ఉన్న హెచ్‌1బీ వీసాలు (H1B visas) ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయా­ర­య్యింది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే హెచ్‌1బీ వీసాలు పొందడంలో మల్టీ నేషనల్‌ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత హెచ్‌1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీనితో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాయి. 

ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి హెచ్‌1బీ వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. మార్చి7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతాయన్న అంచనాలను నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది.

కంపెనీలపై తీవ్ర ప్రభావం
ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్నవారిలో 20 శాతంకు మించి హెచ్‌1బీ వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోందని, ఈ నిర్భంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకు వస్తున్నాయని  ఫోర్బ్స్‌ తన నివేదికలో వ్యాఖ్యానించింది.

ఇతర వీసాల జారీ సులభం
హెచ్‌1బీ వీసాకంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.  2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకులు కోటాలో జారీ చేసే బీ1/బీ2 వీసాలు 72 శాతం మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల  కోటాలో జారీ అయ్యే జే1 వీసాలు 89 శాతానికి ఇమిగ్రేషన్‌ అధికారుల ఆమోదముద్ర పడింది.  

అమెరికాలో హెచ్‌1బీ వీసాలు కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీల్లో రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలపైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతీ భారతీయుడు హెచ్‌1బీ వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటాడు. అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండికొట్టిందని ఎంఎన్‌సీ కంపెనీలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement