G-7 Summit: రష్యాను ఆర్థికంగా దెబ్బతీద్దాం 

G7 Leaders Pledge Action On Russia IN G-7 Summit In Germany - Sakshi

జి–7 దేశాధినేతల ప్రతిన 

ముగిసిన శిఖరాగ్ర సదస్సు 

ఎల్మౌ(జర్మనీ): ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని జి–7 దేశాధినేతలు ప్రతినబూనారు. రష్యా దాడులు కొనసాగినంత కాలం ఉక్రెయిన్‌కు మద్దతివ్వాలని ఐక్యంగా తీర్మానించారు. జర్మనీలో జరుగుతున్న జి–7 నేతల సదస్సు మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నేతలు తుది ప్రకటన వెలువరించారు.

‘‘రష్యాపై తక్షణం, అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాలని తీర్మానించాం. పెట్రోల్, గ్యాస్‌ తదితర శిలాజ ఇంధనాల విక్రయాలతో అందుతున్న నిధులతోనే రష్యా యుద్ధానికి దిగింది. అందుకే, రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఈ శిలాజ ఇంధనాలతోపాటు, వాటి ధరలపై పరిమితులు విధించేందుకు వీలు కల్పించే చర్యలపై వచ్చే రానున్న వారాల్లో చర్చించి, కార్యాచరణకు దిగుతాం. రష్యాపై ఆంక్షల కొనసాగింపు విషయంలో కలిసి కట్టుగా సమన్వయంతో ముందుకు సాగేందుకు కట్టుబడి ఉంటాం’అని అందులో పేర్కొన్నారు.

రష్యా నుంచి ఇంధన దిగుమతులను కనీస స్థాయికి తేవడం ద్వారా ఇంధన ధరలను అదుపు చేయవచ్చని జి–7 నేతలు భావిస్తున్నారు. ఇంధన సరఫరా నౌకలు, బీమా కంపెనీలు అత్యధికం యూరప్‌ దేశాలవే కావడం కూడా కలిసివచ్చే అంశమని ఆశిస్తున్నారు. దీంతోపాటు, రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించడంతోపాటు, నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్‌ నుంచి గోధుమల రవాణాను రష్యా నిలువరించడంతో ఆహారం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు సాయం చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో సహజవాయు అన్వేషణకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కూడా తీర్మానించారు. ఉక్రెయిన్‌లోని క్రెమ్‌చుక్‌ షాపింగ్‌మాల్‌పై రష్యా దాడిని జి–7నేతలు తీవ్రంగా ఖండించారు.

ఇది యుద్ధ నేరమేనన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను దీనికి బాధ్యుడిని చేస్తామన్నారు.  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో చైనా ఆవలంభిస్తున్న వైఖరిపై జి–7 నేతలు ఆందోళన వెలిబుచ్చారు. దురాక్రమణను ఆపేలా రష్యాను చైనా ఒప్పించాలని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లను అధిగమించేందుకు చైనాతో కలిసి పనిచేయాలని కూడా అంగీకారానికి వచ్చారు. దీంతోపాటు, గ్లోబల్‌ వార్మింగ్‌ను ఎదుర్కొనే విషయంలో ఆసక్తి చూపే దేశాలతో కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కూటమిలో చేరే దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై వాతావరణ సంబంధ పన్నులను రద్దు చేయాలని కూడా తీర్మానించారు. కొత్త కూటమికి సంబంధించిన విధివిధానాలను ఈ ఏడాదిలోనే ఖరారు చేస్తామని జర్మనీ ఛాన్సెలర్‌ షోల్జ్‌ చెప్పారు. మాడ్రిడ్‌లో 28–30 తేదీల్లో జరిగే నాటో సమావేశానికి నేతలు తరలివెళ్లారు.

యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని భేటీ


అబుదాబి: యూఏఈ నూతన అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భేటీ అయ్యారు. అబుదాబి విమానాశ్రయంలో షేక్‌ మొహమ్మద్‌తోపాటు రాజకుటుంబానికి చెందిన సీనియర్‌ సభ్యులు మోదీకి ఘన స్వాగతం పలికారు. షేక్‌ మొహమ్మద్‌ తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మృతికి సంతాపం తెలిపారు.

పీవీకి మోదీ నివాళులు
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పీవీ దేశానికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ‘ దేశ ప్రగతికి ఆయన చేసిన కృషికి దేశం కృతజ్ఞతలు తెలుపుతోందంటూ ట్వీట్‌ చేశారు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top