దిగ్గజ టెక్‌ కంపెనీలపై 15 శాతం గ్లోబల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌

G7 global corporate tax deal - Sakshi

ఆన్‌లైన్‌ కంపెనీల పన్ను విధానాలపై చర్చలు

ఒప్పందంపై సంతకాలు చేసిన జీ–7 దేశాలు

లండన్‌: ప్రపంచంలోని దిగ్గజ టెక్నాలజీ కంపెనీలపై మరొక పన్ను భారం పడనుంది. 15 శాతం గ్లోబల్‌ కార్పొరేట్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ విధానానికి జీ–7 దేశాలు అంగీకరించాయి. బహుళ జాతి కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించే ప్రతి దేశంలో గ్లోబల్‌ ట్యాక్స్‌ రేట్‌ 15 శాతంగా ఉండాలని తీర్మానించాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్‌ జీ–7 దేశాల ఆర్ధిక మంత్రులతో లండన్‌లో సమావేశం జరిగింది. ఈ మేరకు ఆయా దేశాలు ఒప్పందం మీద సంతకాలు చేశాయని బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ తెలిపారు.

‘ ఈ ఒప్పందంతో సరైన కంపెనీలు సరైన పన్నులను సరైన ప్రదేశాలలో చెల్లిస్తాయి’ అని రిషి ట్వీట్‌చేశారు. ఒప్పందంలో కార్పొరేట్‌ పన్ను విధానంలో పోటీ ధరల తగ్గింపు నియంత్రణ ధిక్కరణలు ఉండవని అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి, శ్రామిక ప్రజలకు న్యాయం జరిగేలా ఉంటుందన్నారు. జూన్‌ 11–13 తేదీల్లో కార్న్‌వాల్‌లోని కార్బిస్‌బేలో జరగాల్సిన జీ–7 దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు ఆర్ధిక మంత్రుల సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా 15 శాతం కార్పొరేట్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ విధానానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మద్దతు ఇవ్వడంతో.. ఈ ప్రతిపాదనకు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు చేతులు కలిపాయి. భౌతికంగా ఉనికి లేకపోయినా సరే వ్యాపారం చేసే ఇంటర్నెట్‌ ఆధారిత సంస్థలకు (ఆన్‌లైన్‌ కంపెనీలు) కూడా పన్ను విధానాల సమస్యలను పరిష్కరించేందుకు జీ–7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చాలా వరకు ఆన్‌లైన్‌ కంపెనీలు తక్కువ లేదా నో ట్యాక్స్‌లతో కార్యకలాపాలు సాగిస్తుంటాయి.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top