భారీ వర్షాలు, వరదలతో 51 మంది మృతి
మరో 12 మంది జాడ గల్లంతు
కఠ్మాండు/న్యూఢిల్లీ: కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నేపాల్‌లో కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో కొట్టుకుపోయిన కొందరి జాడ తెలియాల్సి ఉందని ఆదివారం ఉదయం అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో 114 మందిని సహాయక సిబ్బంది కాపాడారన్నారు. నేపాల్‌లోని ఏడు ప్రావిన్స్‌లకు గాను ఐదు ప్రావిన్స్‌ల పరిధిలో రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు.
దీంతో ప్రభుత్వం సోమవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. కోషి ప్రావిన్స్‌లోని ఇలమ్ జిల్లా ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా ప్రభావితమైంది. రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఈ జిల్లాలో 37 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఇలమ్‌లో కొండచరియ విరిగి ఓ నివాసంపై పడటంతో అందులో నిద్రిస్తున్న కుటుంబంలోని ఆరుగురు చనిపోయారని అధికారులు వివరించారు. ఖొటంగ్, రౌటహట్ జిల్లాల్లో పిడుగుపాటుకు ఐదుగురు బలయ్యారు.
Heavy rainfall across the Kathmandu Valley today has caused the Bagmati River to swell significantly, leading to elevated water levels and localized flooding risks.
📍Sanepa Bridge
🎥Trending Nepal pic.twitter.com/WN0xTR733e— Naveen Reddy (@navin_ankampali) October 5, 2025
పంచ్‌తర్ జిల్లాలో కుంభవృష్టి కారణంగా రోడ్లు దెబ్బతినడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. లంగంగ్ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. రసువా జిల్లాలో నలుగురు, ఇలమ్, బారా, కఠ్మాండుల్లో ఒక్కొక్కరు చొప్పున వరదల్లో కొట్టుకుపోయారని అధికారులు వివరించారు. ఆదివారం మధ్యాహ్నానికి పరిస్థితి మెరుగవడంతో రాజధాని కఠ్మాండులోకి ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను అనుమతించారు. అయితే, వర్షాల తీవ్రతకు అక్కడక్కడా రోడ్లు కొట్టుకుపోయి దెబ్బతినడంతో వాహనదారులు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు.అదే సమయంలో, నేపాల్ ప్రజలు జరుపుకునే అతిపెద్దదైన దుషైన్ పండుగ ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి కఠ్మాండుకు తిరిగి వచ్చే వారితో రోడ్లు కిటకిటలాడుతున్నాయి. రాత్రి వేళ వాహనదారులు ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లు కొట్టుకుపో యాయని, కొండచరియల ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కొన్ని రహదారులను ముందుజాగ్రత్తగా మూసివేశామన్నారు. ఆగకుండా కురుస్తున్న వానలు, దృగ్గోచరత తక్కువగా ఉండటంతో కఠ్మాండులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు శనివారం విమానాల రాకపోకలను నిలిపివేశారు.
ఆదుకుంటాం: మోదీ
నేపాల్‌లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై భారత ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మిత్ర దేశం నేపాల్‌కు ఎలాంటి అవసరము న్నా ముందుగా స్పందించి ఆదుకునేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.


