కోవిడ్ టీకా తీసుకోలేదా..? అయితే ప్రభుత్వ ఉద్యోగం ఊడినట్టే!

Fiji To Make Covid Vaccine Compulsory, Says NO JABS NO JOB - Sakshi

సువా, ఫిజి: కరోనా మహమ్మారి వివిధ రూపాంతరాలు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న వేళ, పలు దేశాలు వ్యాక్సిన్‌ వేసుకోవడాన్ని తప్పనిసరి చేశాయి. అయినప్పటికీ కొందరు టీకాలపై అపనమ్మకాలు, అపోహల కారణంగా ఇప్పటికీ టీకాలు వేసుకునేందుకు ముందుకురావడం లేదు. దీంతో వారు టీకాలు తీసుకునేలా ప్రోత్సహించేందుకు చాలా దేశాలు వెరైటీ బహుమతులు కూడా ప్రకటించాయి. అయినా ముందుకురాని కొందరి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు పలు దేశాలు సన్నద్ధమయ్యాయి. తాజాగా తమ దేశ పౌరులకు కోవిడ్ టీకాను తప్పనిసరి చేయాలని ఫిజి దేశ ప్రభుత్వం నిర్ణయించింది.

కోవిడ్ టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిసైడ్‌ అయ్యింది. ‘NO JABS, NO JOB‘ అంటూ ఫిజి ప్రధాని ఫ్రాంక్ బైనిమారామా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్, భౌతిక దూరం నిబంధనలను దేశ ప్రజలు ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. డెల్టా వేరియంట్ భయాల నేపథ్యంలో కోవిడ్ టీకాలు తీసుకోకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయని ఫిజి ప్రధాని హెచ్చరించారు. ఆగస్టు 15నాటికి మొదటి డోస్ టీకా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులంతా సెలవులపై వెళ్లాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. నవంబరు ఒకటికల్లా వారు రెండో డోస్ వేయించుకోని పక్షంలో ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు.

ప్రైవేటు ఉద్యోగులు ఆగస్టు ఒకటి నాటికల్లా మొదటి డోస్ వేయించుకోని పక్షంలో భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 9.3 లక్షల జనాభా కలిగిన దక్షిణ పసిఫిక్ దేశమైన ఫిజిలో ఇప్పటి వరకు 3.40 లక్షల మంది జనం మాత్రమే టీకాలు తీసుకున్నారు. మిగిలిన వాళ్లు టీకాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అయితే, టీకాలు తీసుకోలేదన్న కారణంతో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫిజి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా…మరికొందరు దీన్ని నియంతృత్వ పోకడగా అభివర్ణిస్తూ వ్యతిరేకిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top