
మార్చి–మే మధ్య మన విద్యార్థులకు 9,906 వీసాలు
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 27% తగ్గుదల
వలసలపై ట్రంప్ కఠిన చర్యల ప్రభావమే కారణం
యూఎస్‌లో చదువుకోవాలని, అక్కడ స్థిరపడాలన్న భారతీయ విద్యార్థుల కలలపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస వ్యతిరేక విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ఫలితంగానే భారతీయ విద్యార్థులకు వీసాలు భారీగా తగ్గాయి. 2025 మార్చి–మే మధ్య జారీ అయిన ఎఫ్–1 విద్యార్థి వీసాలు.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 27% క్షీణించాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం, అలాగే అభ్యర్థుల సామాజిక ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అనుమతించడం ఇందుకు ప్రధాన కారణాలు.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి అంతర్జాతీయ విద్యార్థుల జీవితాలు కష్టాల్లో పడ్డాయి. అమెరికన్ యూనివర్సిటీలు ఏటా ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. భారతీయ విద్యార్థులు సాధారణంగా ఆగస్టు–డిసెంబర్ సెమ్‌నే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. దీని కోసం 6 నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. అలా సాధారణంగా ఏటా మార్చి–జూలై మధ్య వీసాల సందడి ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మార్చి–మే మధ్య భారతీయ విద్యార్థులు 9,906 ఎఫ్–1 (విద్యా) వీసాలను పొందారు.
గత ఏడాది ఇదేకాలంలో 13,478 వీసాలను అందుకున్నారు. కోవిడ్–19 తర్వాత 2025 మార్చి–మే నెలల్లో అత్యల్ప స్థాయిలో వీసాలు మంజూరు అయ్యాయని అమెరికా విదేశాంగ శాఖ తాజా నివేదిక తెలిపింది. భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం మార్చి–మే నెలల్లో 2022లో 10,894, 2023లో 14,987 వీసాలు జారీ చేసింది. ఏప్రిల్ నాటికి యూఎస్ అధికారులు అక్కడి కనీసం 32 రాష్ట్రాల్లో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేశారని ఎన్‌బీసీ న్యూస్ తెలిపింది. వీసా దరఖాస్తుదారుల పరిశీలన కోసం యూఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తోంది.
ప్రాసెసింగ్‌కు సమయం..
విద్యార్థుల దరఖాస్తులు తగ్గడం, తిరస్కరణలు పెరగడం, ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడంలో జాప్యం వీసాల తగ్గుదలకు కారణం అయి ఉండొచ్చని యూఎస్ రాయబార కార్యాలయం చెబుతోంది. ఎఫ్–1 వీసాల ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందన్న అంచనాతో దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే నాన్–ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల షెడ్యూలింగ్ ప్రారంభం అయిందని, దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ కోసం సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
‘ప్రపంచవ్యాప్తంగా వీసా జారీ ప్రక్రియ అత్యున్నత ప్రమాణాలకు లోబడి ఉందని నిర్ధారించుకోవడానికి, దరఖాస్తుల పూర్తి పరిశీలనకు తగినంత సమయం ఇవ్వడానికి కాన్సులర్ విభాగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. వీసా దరఖాస్తుదారులకు యూఎస్‌కు లేదా మా ప్రయోజనాలకు హాని కలిగించే ఉద్దేశం లేదని, వారు కోరిన వీసా కోసం వారి అర్హతను విశ్వసనీయంగా వెల్లడించారని నిర్ధారించుకోవడానికి అనునిత్యం పని చేస్తున్నాం’ అని యూఎస్ ఎంబసీ ప్రతినిధులు చెబుతున్నారు.
మనవాళ్లే ఎక్కువ..
వీసా జారీలో ఇటీవల తగ్గుదల ఉన్నప్పటికీ.. వాస్తవానికి అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య వృద్ధి గణనీయంగా ఉంది. ఓపెన్ డోర్స్ 2024 డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో యూఎస్‌లో అడ్మిషన్స్ తీసుకున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం కావడం విశేషం. గత ఏడాది జనవరి–సెపె్టంబర్‌లో భారతీయ విద్యార్థులు 64,008 ఎఫ్–1 వీసాలు అందుకున్నారు. ఇదే కాలంలో 2023లో 1.03 లక్షలు, 2022లో 93,181 వీసాలు జారీ అయ్యాయి.
తనిఖీలు కఠినం
ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల గురించి లోతుగా పరిశీలించడం ప్రారంభించిన తరుణంలో ఈ తగ్గుదల నమోదు కావడం గమనార్హం. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలతో ముడిపడి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయులతో సహా అనేక మంది వ్యక్తులకు వీసాల రద్దు కూడా జరిగింది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలపై మరింత కఠినమైన తనిఖీలను ప్రవేశపెట్టడానికి మే 27 నుంచి జూన్ 18 వరకు కొత్త దరఖాస్తులను నిలిపివేశారు.
విద్యార్థి వీసా దరఖాస్తుదారుల కోసం కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడాన్ని నిలిపివేయాలని రాయబార కార్యాలయాలు, కాన్సులర్ విభాగాలను మే నెలలో యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి చేయాలని భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్, ఎం, జే విభాగాల వీసాల స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి సోషల్ మీడియా ఖాతాల అయిదు సంవత్సరాల వివరాలను బహిరంగపరచాలని న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం దరఖాస్తుదారులకు ఆదేశించింది.