కరోనా వేళ.. క్రిస్మస్‌ ఎలా..!

Europe Countries shut down completely during Christmas and New Year - Sakshi

పలురకాల ఆంక్షలు విధిస్తున్న ప్రపంచ దేశాలు

భయం గుప్పిట్లో యూరోప్‌

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల ఉత్సాహం కరోనా పుణ్యమా అని మసకబారుతోంది. ఒకపక్క ఈ మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిందని సంతోషించేలోగానే, కొత్త రూపు సంతరించుకొని దాడి చేయడం ఆరంభించింది. దీంతో పలు దేశాలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకురాగా, కొన్ని దేశాలు తేలికపాటి ఆంక్షలు తెచ్చాయి. ప్రజలు సమూహంగా గుమిగూడటం నుంచి విందు భోజనాల వరకు అనేక అంశాలపై పరిమితులు విధించాయి. నూతన సంవత్సర వేడుకల్లో కొత్తరూపంలో కరోనా దాడి చేయకుండా దేశాల మధ్య ప్రయాణాలపై నిషేధాజ్ఞలు పెరిగాయి. యూరప్‌ దేశాలైతే దాదాపు భయం గుప్పిట్లోకి జారాయి. ఆయా దేశాల వాతావరణ, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకున్నాయి.
–లండన్‌
 
బ్రిటన్‌లో షట్‌డౌన్‌
నిన్నమొన్నటి వరకు క్రిస్మస్‌ సమయంలో ఆంక్షలన్నీ రద్దు చేయాలని బ్రిటన్‌ భావించింది. వ్యాక్సినేషన్‌ కూడా ఆరంభించింది. అయితే ఒక్కమారుగా కొత్త స్ట్రయిన్‌ బయటపడడంతో ఉలిక్కిపడింది. ప్రస్తుతం పాత ప్లాన్లన్నీ రద్దు చేసి పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, వేల్స్, నార్తర్న్‌ ఐలాండ్‌ల్లో వివిధ రూపాల్లో లాక్‌డౌన్‌ను పునఃప్రారంభించారు. లండన్‌లోనైతే ఇంట్లో కూడా సామూహిక వేడుకలు వద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు డజన్ల కొద్దీ దేశాలు బ్రిటన్‌కు విమానాలు నిలిపివేశాయి.  

లెబనాన్‌ తీరేవేరు
ఆర్థికంగా కూనారిల్లుతున్న ఎకానమీని గట్టెక్కించడానికి విదేశీ మారక ద్రవ్యార్జనే మార్గమని భావించిన లెబనాన్‌ చాలా ఆంక్షలు ఎత్తివేసింది. నైట్‌క్లబ్బులు తెరిచిఉంచేందుకు అనుమతినిచ్చింది. అయితే క్లబ్బుల్లో డ్యాన్సులను నిషేధించింది.

అమెరికాలోరాష్ట్రాలదే నిర్ణయం
అమెరికా ప్రభుత్వం దేశవ్యాప్తం ప్రయాణాలపై జాతీయ స్థాయిలో నిషేధం విధించలేదు. ఆయా రాష్ట్రాలే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వీలు కల్పించింది. కానీ వీలయినంత వరకు ఇంట్లోనే ఉండమని ప్రజలకు సూచించింది.

దక్షిణాఫ్రికాలో మందు బం§Š
క్రిస్మస్‌ రోజు దేశంలో మందు అమ్మకాలను దక్షిణాఫ్రికా నిలిపివేసింది. దేశంలో పలు చోట్ల నైట్‌కర్ఫ్యూ విధించింది. క్రిస్మస్, న్యూఇయర్‌ రోజును బీచ్‌లు మూసివేస్తున్నట్లు తెలిపింది. సామూహికంగా తిరగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇంట్లో మాత్రం 100 మంది వరకు కలుసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు దక్షిణాఫ్రికాకు విమానాలు నిలిపివేస్తున్నాయి.  

బ్రెజిల్‌లో మీ ఇష్టం
ఆది నుంచి కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బోల్సెనారో ప్రభుత్వం క్రిస్మస్‌ సమయంలో ఎలాంటి కొత్త ఆంక్షలు లేవని తెలిపింది. సోపౌలో నగర గవర్నర్‌ మాత్రం స్వల్ప ఆంక్షలు విధించారు. సోపౌలో, రియో, సాల్వ డార్‌లో డిసెంబర్‌ 31న బాణసంచా కాల్చడాన్ని నిలిపివేశారు.  

జర్మనీలో పాటలు నిషిద్ధం
వచ్చే నెల 10వరకు కొత్త ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24–26 మధ్య మాత్రం స్వల్ప సడలింపులుంటాయని తెలిపింది. మ తపరమైన సమావేశాలు జరపవచ్చని, కానీ పాటలు మాత్రం నిషిద్ధమని తెలిపింది.

ఇతర దేశాల్లో...
► పెరూలో క్రిస్మస్‌ రోజు కారు డ్రైవింగ్‌ను నిషేధించారు.  
► ఫ్రాన్స్‌లో సామూహిక విందు భోజనాల్లో పాల్గొనేవారి సంఖ్యను ఆరుకు పరిమితం చేశారు. వచ్చే నెల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు.  
► చిలీలో విందు భోజనాలకు 15మంది వరకు అనుమతినిస్తున్నారు.  
► ఇటలీలో వచ్చే రెండువారాల వరకు ప్రయాణాలు నిషేధించారు.  
► పోర్చుగల్‌లో క్రిస్మస్‌కు కొంతమేర సడలింపులిచ్చి న్యూఇయర్‌కు కఠిన ఆంక్షలు విధించనున్నారు.  
► స్పెయిన్‌లో స్వల్ప సడలింపులతో వేడుకలకు అనుమతించారు.  
► దక్షిణ కొరియాలో వచ్చే నెల 3వరకు ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై ఆంక్షలు తెచ్చారు.  
► రష్యాలో వచ్చేనెల 15వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top