భారత ఎంబసీపై డ్రోన్‌ చక్కర్లు

Drone Spotted In Indian High Commission In Pakistan - Sakshi

పాక్‌లోని ఇస్లామాబాద్‌లో ఘటన

ఆలస్యంగా వెలుగులోకి..

తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌

న్యూఢిల్లీ: ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంపై గతవారం ఒక డ్రోన్‌ చక్కర్లు కొట్టిన ఘటన భారత్‌ స్పందించింది. ఆ ఘటనపై విచారణ జరపాలని, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఈ ఘటనపై పాక్‌లోని భారత హై కమిషన్‌ కూడా పాకిస్తాన్‌కు ఘాటుగా లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

‘ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయ భవనంపై జూన్‌ 26న ఒక డ్రోన్‌ ఎగురుతుండడాన్ని గుర్తించాం. దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా పాకిస్తాన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పాకిస్తాన్‌ విచారణ జరుపుతుందని, ఇలాంటి భద్రతాపరమైన లోపాలు మళ్లీ తలెత్తకుండా చూస్తుందని భావిస్తున్నాం’ అని శుక్రవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరింధమ్‌ బాగ్చీ మీడియాకు తెలిపారు. జమ్మూ విమానాశ్రయంలోని వైమానిక దళ కేంద్రంపై జూన్‌ 27న జరిగిన డ్రోన్‌ దాడి ఉగ్రవాదుల దుశ్చర్యేనని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్కేఎస్‌ భదౌరియా శుక్రవారం పేర్కొన్నారు.

అది భారత్‌ తప్పుడు ప్రచారం
భారత హైకమిషన్‌ కార్యాలయంపై డ్రోన్‌ చక్కర్లు కొట్టిందన్న ఆరోపణలను పాకిస్తాన్‌ తోసిపుచ్చింది. అది భారత్‌ చేస్తున్న తప్పుడు ప్రచారమని ఎదురుదాడి చేసింది. భారత హై కమిషన్‌ కార్యాలయ భవనంపై ఎలాంటి డ్రోన్‌లు తిరగలేదని పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్‌ హఫీజ్‌ చౌధరి చెప్పారు. డ్రోన్‌ చక్కర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కూడా భారత్‌ తమకు అందించలేదన్నారు. జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడిపై ఆయన స్పందించలేదు.  

కశ్మీర్లో భారీ ఎన్‌కౌంటర్‌
శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్లో శుక్రవారం భద్రత బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒక డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ కూడా ఉన్నాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒక జవాను, అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొది లారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో శుక్రవారం ఉదయం  జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, రాజ్‌పొరా ప్రాంతంలో ఉన్న హంజిన్‌ గ్రామం వద్ద భద్రత బలగాలు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డారని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఘటన స్థలానికి అదనపు బలగాలు చేరుకుని టెర్రరిస్ట్‌లపై కాల్పులు జరిపాయన్నారు. ఈ కాల్పుల్లో లష్కరే జిల్లా కమాండర్‌ నిషాజ్‌ లోన్‌ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. హతుల్లో ఒక పాకిస్తానీ కూడా ఉన్నాడన్నారు.

పాక్‌ డ్రోన్‌పై కాల్పులు
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఒక డ్రోన్‌పై బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్పులు జరిపారు. అది పాకిస్తానీ నిఘా డ్రోన్‌గా అనుమానిస్తున్నారు. జమ్మూ శివార్లలోని ఆర్ని యా సెక్టార్‌లో శుక్రవారం తెల్లవారు జామున ఈ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గుర్తించారు. వెంటనే ఆ డ్రోన్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం, ఆ డ్రోన్‌ మళ్లీ పాక్‌ భూభాగంలోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంపై నిఘా వేసేందుకు ఆ డ్రోన్‌ను ప్రయోగించి ఉంటారని బీఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని కీలక రక్షణ స్థావరాలపై సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి సమయంలో పలు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top