డీల్ నచ్చలేదు.. సంతకం చేయను : ట్రంప్ 

Dont Like TikTok Deal Says Donald Trump  - Sakshi

టిక్‌టాక్‌ ఒరాకిల్  ఒప్పందానికి  ట్రంప్ బ్రేక్స్

టిక్‌టాక్‌ బిజినెస్ అమ్మకంపై మరోసారి ప్రతిష్టంభన

వాషింగ్టన్ : చైనా సంస్ధ బైట్ డ్యాన్స్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ ఒరాకిల్ డీల్ కు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తాజా వ్యాఖ్యలతో బ్రేకులు పడనున్నాయి. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఒరాకిల్ టిక్‌టాక్‌ అమెరికా వ్యాపారం కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించేందుకు తాను సిద్దంగా లేనని ట్రంప్ వెల్లడించారు. ప్రధానంగా బైట్‌డాన్స్‌కు మెజారిటీ వాటా, ఒరాకిల్ సంస్థకు మైనారిటీ వాటా ప్రకారం కుదరనున్న ఒప్పందానికి తాను వ్యతిరేకమని చెప్పారు. జాతీయ భద్రతకు సంబంధించినంతవరకు అది100 శాతం అమెరికా సంస్థదై ఉండాలి. ప్రతిపాదిత ఒప్పందంపై సంతకం చేయడానికి తాను సిద్ధంగా లేననీ, ఈ ఒప్పందాన్ని తాను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. తుది డీల్ ఇంకా కుదరలేదన్నారు. దీనిపై గురువారం అధికారులతో సమావేశం కానున్నట్లు ట్రంప్  చెప్పారు.

భద్రతకు ముప్పు, గోప్యత ఆందోళనల నేపథ్యంలో టిక్‌టాక్‌ ను అమెరికా సంస్థకు విక్రయించాలని, లేదంటే నిషేధిస్తామని ట్రంప్ బైట్‌డాన్స్‌కు గడువు విధించారు. ఈ డీల్  ద్వారా పెద్ద మొత్తం యుఎస్ ట్రెజరీకి వెళ్లాలని గతంలోనే ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టిక్ టాక్ బిజినెస్ ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు ఆసక్తిని చూపాయి. చివరికి  ఒరాకిల్ సంస్థ టిక్ టాక్ కొనుగోలుకు సిద్ధమైంది. మొదట్లో ఒరాకిల్ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించిన ట్రంప్, అద్భుతమైన వ్యక్తి అంటూ సంస్థ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ పై ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. కానీ తాజా ఒప్పందంపై ట్రంప్ అసంతృప్తి బిడ్ విజయవంతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. టిక్ టాక్ కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించే లేదా తిరస్కరించే అధికారం ట్రంప్‌ చేతిలోనే. దీంతో పూర్తి హక్కులు అమెరికా సంస్థదై ఉండాలన్న తన వాదనకు కట్టుబడి ఉన్నారు, అంతేకాదు ఈ ఒప్పందం ద్వారా గణనీయమైన వాటా ప్రభుత్వ ఖజానాకు చేరాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం. దీంతో అమెరికాలో టిక్‌టాక్‌ భవితవ్యం మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top