
అమెరికా విస్కీపై 50 శాతం
సుంకం విధిస్తామన్న యూరప్ దేశాలు
నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్
లేకపోతే యూరప్ మద్యంపై 200 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా, యూరప్ మధ్య టారిఫ్‌ల యుద్ధం మరింత ముదురుతోంది. ఇరుపక్షాలు సై అంటే సై అంటున్నాయి. తగ్గేదేలే అన్నట్లుగా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అమెరికా నుంచి దిగుమతి అయ్యే విస్కీపై యూరప్ దేశాలు బుధవారం ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయకపోతే ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వైన్స్, షాంపేన్స్, ఇతర ఆల్కహాలిక్ ఉత్పత్తులపై 200 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.
దీనివల్ల యూరప్ మద్యం అత్యంత ఖరీదుగా మారిపోతుందని, అంతిమంగా అమెరికాలో స్వదేశీ వైన్, షాంపేన్ వ్యాపారం లాభపడుతుందని తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు చేశారు. యూరప్ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్ విధిస్తూ అమెరికా ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ టారిఫ్ రద్దు చేయాలని యూరప్ దేశాలు కోరినా ట్రంప్ యంత్రాంగం లెక్కచేయలేదు. దాంతో ప్రతీకార సుంకాలకు తెరతీసిన యూరప్ దేశాలు అమెరికా ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకున్నాయి.
28 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా పడవలు, మోటార్‌బైక్‌లపై వచ్చేనెల నుంచి సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించాయి. అమెరికా విస్కీని సైతం వదిలిపెట్టలేదు. 50 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించాయి. అందుకు పోటీగా యూరప్ మద్యంపై 200 శాతం టారిఫ్‌ను విధించడం ఖాయమని ట్రంప్ ప్రకటించడం చూస్తే పరిస్థితి చెయ్యి దాటిపోతున్నట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల వ్యవహారం చివరకు భీకరమైన వాణిజ్య యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అమెరికా మద్యం కంపెనీలకు ఇక్కట్లు: డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడల్లా అమెరికా మద్యం కంపెనీలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎందుకంటే ఇతర దేశాలు అమెరికా మద్యంపై టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి. అమెరికాలోని కెంటకీ, టెన్నెస్సీ రాష్ట్రాల్లో విస్కీ కంపెనీలు అధికంగా ఉన్నాయి. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాలు ట్రంప్‌నకే మద్దతు పలికాయి. అయినా ట్రంప్ ఆ దిశగా ఆలోచించకపోవడం గమనార్హం. అమెరికా మద్యంపై పొరుగుదేశం కెనడా ఇప్పటికే సుంకాలు విధించింది. ఇతర దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లపై అమెరికాలోని జాక్ డేనియల్స్ కంపెనీ సీఈఓ బ్రౌన్ ఫార్మన్ ఇటీవల ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఉత్పత్తి చేసిన విస్కీని ఇతర దేశాల్లో విక్రయించకుండా చేస్తున్నారని ఆక్షేపించారు.

విస్కీపై సుంకం అసహ్యంగా ఉంది: ట్రంప్
తమ విస్కీపై యూరప్ దేశాలు 50 శాతం టారిఫ్‌ను ప్రకటించడం పట్ల అమెరికా మద్యం పరిశ్రమ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. యూరప్‌కు విస్కీ ఎగుమతులు మళ్లీ పెంచాలని ఇటీవలే నిర్ణయించామని, ఈ టారిఫ్‌ల వల్ల అది నెరవేరే అవకాశం లేదని అమెరికా డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్ సీఈఓ క్రిస్ స్వాగ్నర్ చెప్పారు. బుధవారం యూరప్ నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ట్రంప్ స్పందించారు. వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో మాట్లాడారు. యూరప్ సుంకాలపై తగిన విధంగా బదులిస్తానని చెప్పారు. అన్నట్లుగానే గురువారం బాంబు పేల్చారు. 200 శాతం సుంకాలు అంటూ గట్టిగా బదులిచ్చారు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పన్నులు, సుంకాలు యూరప్ దేశాల్లో ఉన్నాయని ఆరోపించారు. అమెరికా నుంచి దోచుకోవాలన్న యావ తప్ప మరొకటి లేదని యూరప్ దేశాల ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ఆఖరికి విస్కీపై కూడా టారిఫ్ విధించడం అత్యంత అసహ్యంగా ఉందన్నారు.
టారిఫ్ ప్లాన్లు ఆగవు
టారిఫ్‌లలో ఉన్న సమస్య ఏమిటంటే అవి మరిన్ని టారిఫ్‌లకు దారితీస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా, యూరప్ మధ్య ఈ టారిఫ్‌ల రగడ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఒక్కసారి అందులో కూరుకుపోతే బయటపడడం అంత సులభం కాదు. తమ టారిఫ్ ప్రణాళి కలను సమీప భవిష్యత్తులో ముగించే అవకాశం లేదని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు సైతం ఆయన తలొగ్గడం లేదు. పైగా అదనపు టారిఫ్‌లు ఉంటాయని చెబుతున్నారు. ఇండియా, చైనా సహా పలు దేశాల ఉత్పత్తులపై విధించిన సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment