
ఓస్లో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా ప్రతిపక్షనేత మరియా కొరీనా మచాడోకు (María Corina Machado) నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
ఈ క్రమంలో 2025 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ మిస్ కావడం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రపంచ శాంతికి కృషి చేసిన మహానుభావులు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటుంటే, మరోవైపు కొన్ని వివాదాస్పద వ్యక్తులు కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను పరశీలిస్తే..
👉ఇదీ చదవండి : మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం
యాసిర్ అరాఫత్ (1994): ఇజ్రాయెల్-పాలస్తీన్ మధ్య ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ ఆయనపై తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఉండటం వల్ల విమర్శలు ఎదురయ్యాయి.
బరాక్ ఒబామా (2009): అధ్యక్ష పదవిలోకి వచ్చిన ఏడాదిలోనే శాంతి ప్రయత్నాలకు బహుమతి రావడం అనేక ప్రశ్నలు రేకెత్తించింది. ట్రంప్ సైతం తాజాగా ఒబామా ఏం చేశారని అధ్యక్ష పదవి చేపట్టిన 8 నెలలకే నోబెల్ ఇచ్చారని, పైగా ఆయన అమెరికాను నాశనం చేశారని మండిపడ్డారు కూడా.
ఆంగ్ సాన్ సూకీ (1991): మయన్మార్ ప్రజాస్వామ్య పోరాటానికి గుర్తింపుగా బహుమతి పొందారు. కానీ 2017లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన హింసను నిరసించకపోవడం వల్ల ఆమెపై విమర్శలు వచ్చాయి.
హెన్రీ కిస్సింజర్ (1973): వియత్నాం యుద్ధం ముగింపుకు కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ యుద్ధంలో అమెరికా పాత్రపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.
అబి అహ్మద్ (2019): ఈథియోపియాలో శాంతి ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ తరువాత దేశంలో అంతర్గత హింస పెరగడం వల్ల ఆయనపై విమర్శలు వచ్చాయి.
వంగారి మాథై (2004): పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆమె, HIV బాధితులపై చేసిన వ్యాఖ్యల వల్ల వివాదంలోకి వచ్చారు.
గాంధీకి నోబెల్ ఎందుకు రాలేదంటే..
మహాత్మా గాంధీ.. శాంతి, అహింసకు ప్రతిరూపం. ఆయన నోబెల్ శాంతి బహుమతికి పలు మార్లు నామినేట్ అయ్యారు. 1948లో ఆయన హత్యకు గురైన టైంలో నోబెల్ కమిటీ.. ఈ గౌరవానికి అర్హులే లేరు అంటూ ఓ ప్రకటన విడుదల చేయడం వివాదాస్పదమైంది. రాజకీయ కారణాలు, బ్రిటిష్ ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితులు ,ఇవన్నీ బహుమతి రాకపోవడానికి కారణాలుగా భావించబడ్డాయి. అయితే.. నోబెల్ కమిటీ 2006లో “గాంధీకి బహుమతి ఇవ్వకపోవడం మా పెద్ద తప్పు” అని అంగీకరించింది. ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉంటే గనుక.. పై జాబితాలో చేరి ఉండేదే. కానీ, ప్చ్.. ఆయన కల నెరవేరలేదు.