నేడు కోర్టుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

Donald Trump to face criminal charges in Stormy Daniels hush money probe - Sakshi

జడ్జిపై తీవ్ర ఆరోపణలు  

వాషింగ్టన్‌: హష్‌ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (76) మంగళవారం మన్‌హటన్‌ గ్రాండ్‌ జ్యూరీ ముందు హాజరు కానున్నారు. పోర్న్‌ చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌తో తన అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు చేసిన చెల్లింపుల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు మోపుతూ జ్యూరీ గత గురువారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఒక క్రిమినల్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షునిగా ట్రంప్‌ నిలిచారు. మంగళవారం విచారణ తంతు 10 నుంచి 15 నిమిషాల్లో ముగుస్తుందని చెబుతున్నారు.

ట్రంప్‌పై ఏయే అభియోగాలు మోపిందీ ఆయనకు చదివి వినిపిస్తారు. అనంతరం ట్రంప్‌ ఫ్లోరిడా వెళ్లి మంగళవారం రాత్రి మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ఈ కేసును విచారిస్తున్న ప్రాసిక్యూటర్‌తో పాటు జడ్జిపైనా ట్రంప్‌ ఆరోపణలతో విరుచుకుపడ్డారు! ‘‘ఈ కేసు కేవలం నాపై కక్షపూరిత చర్యే. దీన్ని విచారిస్తున్న జడ్జికి నేనంటే అమిత ద్వేషం. కేసును దర్యాప్తు చేస్తున్న జిల్లా అటార్నీ ప్రత్యర్థి డెమొక్రటిక్‌ పార్టీకి చెందినవాడు. ఏరికోరి నన్ను ద్వేషించే జడ్జినే విచారణకు ఎంచుకున్నారు’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. క్రిమినల్‌ విచారణకు దారితీయగల పలు ఇతర అభియోగాలను కూడా ట్రంప్‌ ఇప్పటికే ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top