సాక్షి,న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే భారత్, చైనా సహా ఇతర దేశాలపై ఆంక్షలు విధించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 10 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ఈ చర్యల ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే ట్రంప్ లక్ష్యమని తెలిపారు.
బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మాట్లాడిన గోర్.. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై జరిమానాలు, ఆంక్షలు విధించే అధికారం ట్రంప్‌కు కల్పించే బిల్లుకు అమెరికా సెనేట్‌లో 86 మంది సభ్యులు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ చర్యలు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకుంటున్నవి కావని ఆయన స్పష్టం చేశారు. భారత్‌కు మినహాయింపు ఇస్తారా?.. లేదా?.. అన్నది ట్రంప్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆశాభావం
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు పురోగతిలో ఉన్నాయని సెర్గియో గోర్ వెల్లడించారు. ఇప్పటికే పలు కీలక అంశాలపై అవగాహన కుదిరిందని, మిగిలిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. రక్షణ, ఐటీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ (AI) వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవాలని అమెరికా భావిస్తోందని తెలిపారు. భారత్‌లో అమెరికా కంపెనీల పెట్టుబడులు పెరగడం ద్వారా ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని గోర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కోర్టు ఆదేశం.. అమెరికాలో గ్రీన్ కార్డ్ లాటరీకి గ్రీన్ సిగ్నల్


