వాషింగ్టన్: అమెరికా డైవర్సిటీ వీసా (DV-2027) లాటరీ రిజిస్ట్రేషన్ను తిరిగి ప్రారంభించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించకపోవడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి జిన్సూక్ ఓహ్తా అక్టోబర్ 14న కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
విదేశాంగ శాఖ 30 రోజుల పాటు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించాలని, రిజిస్ట్రేషన్ తేదీలు, వెబ్సైట్ వివరాలు ప్రకటించాలని ఆదేశించారు. ఎంపికైన అభ్యర్థుల కేసులను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు.
ఎందుకు ఆలస్యమైంది?
DV-2027 దరఖాస్తు ప్రక్రియలో మార్పులు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ 2025 నవంబర్లో ప్రకటించింది. కానీ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ తేదీలను మాత్రం వెల్లడించలేదు. దీంతో ఇమ్మిగ్రేషన్ న్యాయ సంస్థ రెడ్ ఈగిల్ లా కోర్టును ఆశ్రయించింది.
ఈ లాటరీ ద్వారా అర్హులైన ఇతర దేశాల పౌరులకు ఏటా గరిష్ఠంగా 55 వేల వలస వీసాలు అందించే అవకాశం ఉంటుంది. కానీ లాటరీలో ఎంపికైనంత మాత్రాన గ్రీన్ కార్డ్ ఖరారైనట్లు కాదు. విద్యార్హత, వృత్తి అనుభవ అర్హతలతో పాటు ఇతర నిబంధనలను కూడా పూర్తి చేయాలి.
వీసాల జారీపై ఇంకా సందిగ్ధత
DV-2027 వీసా సంవత్సరం 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఆలస్యంగా రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడంతో ఎంపిక, ఇంటర్వ్యూలు, వీసా ప్రక్రియకు సమయం తగ్గే అవకాశం ఉంది. అయితే మరోవైపు భద్రతా తనిఖీల సమీక్ష నేపథ్యంలో డైవర్సిటీ వీసాల జారీని నిలిపివేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ గతంలో తెలిపింది. కాబట్టి రిజిస్ట్రేషన్ను తిరిగి ప్రారంభించాలన్న కోర్టు ఆదేశం వచ్చినప్పటికీ, వీసాల జారీ పునరుద్ధరించినట్లు భావించరాదు. దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ తేదీలు, మార్గదర్శకాల కోసం అమెరికా విదేశాంగ శాఖ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు.
ఇదీ చదవండి: అమెరికా కంపెనీలపై రష్యా దాడులు.. కోకాకోలా ప్లాంట్ ధ్వంసం


