అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చల్లబడ్డారు. గ్రీన్‌లాండ్ విషయంలో యూరప్ దేశాలపై విధించబోయే సుంకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దావోస్ వేదికగా గ్రీన్‌లాండ్.. యూరోపియన్ దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
యూరప్‌లో తమ మిత్రదేశాలపై ఫిబ్రవరి 1 నుంచి సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రకటించారు. నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిగిన భేటీలో ఆర్కిటిక్ భద్రతపై భవిష్యత్ ఒప్పందానికి రూపకల్పనపై అంగీకారం కుదిరిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఫిబ్రవరి 1న అమలులోకి రావాల్సిన సుంకాలను విధించబోను. గ్రీన్‌లాండ్‌కు సంబంధించిన "గోల్డెన్ డోమ్" అంశంపై అదనపు చర్చలు కొనసాగుతున్నాయని, చర్చలు ముందుకు సాగేకొద్దీ మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. ఈ చర్చలు, ఒప్పందాలు అమెరికా మరియు నాటో దేశాలందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. చర్చల బాధ్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ మరియు ఇతరులు నిర్వహిస్తారు. వారు నేరుగా నాకు నివేదిస్తారు.. అని ట్రంప్ తన పోస్టులో తెలియజేశారు. అంతకు ముందు..
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ.. గ్రీన్‌లాండ్‌ను ఓ ఐస్ ముక్కగా అభివర్ణించారు. ఎలాగైనా దానిని అమెరికా సొంతం చేసుకోవాల్సిందేనంటూ మాట్లాడారు. అయితే ఇందుకోసం బలప్రయోగం(సైనిక చర్య) చేయబోమని.. అమెరికా విస్తరణను నాటో అడ్డుకునేందుకు ప్రయత్నించకూడదని అంటూనే ఇటు యూరప్ మిత్రదేశాలనూ ఆయన హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికానే యూరప్‌ను రక్షించింది. ఆ సంగతి మరిచిపోకూడదు. అలాగే.. నాటోకు మేమెంతో సాయం అందించాం. కాబట్టి మా అభ్యర్థన చిన్నదే అని అనుకుంటున్నాం అంటూ గ్రీన్‌లాండ్ విషయంలో అడ్డుపడకూడదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో..
మేం బలప్రయోగం జరిపితే పని తేలికగా అవుతుంది. కానీ, అలా చేయం. ఆ అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్‌కు అమెరికా భద్రత కోసం అవసరమని, రష్యా–చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఇది కీలకమని ఆయన వాదించారు.
గ్రీన్‌లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలకు ఈ సుంకం వర్తిస్తుందన్నారు.
ఒకవేళ.. గ్రీన్‌లాండ్‌ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1కల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలను యూరోపియన్ దేశాలు ఖండించాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్.. అమెరికా సుంకాలు విధిస్తే యూరప్ ఒక్కటిగా.. కఠినంగా ప్రతిస్పందిస్తుందన్నారు. అమెరికా–యూరప్ మధ్య వాణిజ్య ఒప్పందం దెబ్బతింటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్ భవిష్యత్తుపై సుంకాల బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం అన్నారు. మరోవైపు యూరోపియన్ పార్లమెంట్ సైతం అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేసే ఆలోచనను తీవ్రతరం చేసింది. ఈలోపు దావోస్‌లో ట్రంప్ ప్రసంగం, నాటో చీప్‌తో భేటీ జరిగిన కాసేపటికే యూరప్ దేశాలపై సుంకాలు విధించాలన్న తన నిర్ణయాన్ని ఆయన మార్చుకున్నారు.
రియాక్షన్ ఇదే..
దావోస్ వేదికగా ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రభుత్వం స్పందించింది. తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని అమెరికాకు స్పష్టం చేసింది. మరోవైపు.. ఇది తమ దేశాన్ని అవమానించడమేనని గ్రీన్‌లాండ్ భావిస్తోంది. ట్రంప్ అనిశ్చితి కలిగించే నాయకుడంటూ తిట్టిపోస్తోంది. అయితే సైనిక చర్య ఉండదని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. గ్రీన్‌లాండ్ ప్రభుత్వం మాత్రం అప్రమత్తమైంది. ఐదు రోజుల పాటు సరిపడా ఆహారం, నీరు, ఇంధనం నిల్వ చేసుకోవాలంటూ ఆ దేశ ప్రజలకు సూచనలు చేసింది. నూక్ నగరంలోని ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


