యుద్ధం ముగింపునకు ట్రంప్ బిగ్‌ ప్లాన్‌.. ఇరాన్‌కు కష్టమే? | Donald Trump Unveils 15 Point Plan To End Iran War Keep Hormuz Open, Focus On Nuclear Curbs And Ceasefire | Sakshi
Sakshi News home page

యుద్ధం ముగింపునకు ట్రంప్ బిగ్‌ ప్లాన్‌.. ఇరాన్‌కు కష్టమే?

Mar 25 2026 9:22 AM | Updated on Mar 25 2026 10:31 AM

Donald Trump 15 Point Plan To End Iran War Keep Hormuz Open

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇరాన్ యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్‌ ప్రకటించారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా ఇరాన్‌కి అణ్వాయుధాలు ఉండకూడదని, క్షిపణి కార్యక్రమాలను తగ్గించాలని సూచనలు చేశారు. దీంతో, ట్రంప్‌ ప్రణాళికను ఇరాన్‌ అంగీకరిస్తుందా? అనే చర్చ నడుస్తోంది.

కాగా, ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో చర్చలకు సిద్దమని అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్‌ సిద్దం చేసినట్టు ఇజ్రాయెల్‌ చానెల్‌ 12 పలు కథనాలను వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా ఇరాన్‌కి అణ్వాయుధాలు ఉండకూడదని, క్షిపణి కార్యక్రమాలను తగ్గించాలని, హార్మూజ్‌ సముద్ర మార్గాన్ని తెరిచి ఉంచాలని, ఒక నెల కాలం కాల్పుల విరమణ జరగాలని సూచించారు. అయితే, ఇరాన్ ఈ చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఖండించింది. కాబట్టి ఈ ప్రణాళిక అమలు అవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక, ఇరాన్‌కి ఉన్న మూడు ప్రధాన శక్తులను (అణు, క్షిపణి, ప్రాంతీయ ప్రభావం) వదులుకోవాలని ట్రంప్‌ కోరుతున్న నేపథ్యంలో ఇది అమలు కష్టమని విశ్లేషకులు అంటున్నారు.

ట్రంప్ 15 పాయింట్ల ప్రణాళికలో ముఖ్యాంశాలు..

  • అణ్వాయుధాలు: ఇరాన్‌కి అణ్వాయుధాలు ఉండకూడదు, అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలి.

  • క్షిపణి కార్యక్రమాలు: బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌ను తగ్గించాలి.

  • హార్మూజ్ సముద్ర మార్గం: అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గాన్ని తెరిచి ఉంచాలి.

  • కాల్పుల విరమణ: ఒక నెలపాటు కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు జరపాలి.

  • ప్రాంతీయ ప్రభావం: ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించాలి.

  • పాకిస్తాన్ మధ్యవర్తిత్వం: ఈ ప్రణాళికను ఇరాన్‌కి పాకిస్తాన్ ద్వారా పంపించారు.

  • సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ: బుషెహర్ వద్ద ఇరాన్‌కి శాంతియుత అణు శక్తి అభివృద్ధికి సహాయం అందించవచ్చని సూచన.

  • నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను నిలిపివేసి ధ్వంసం చేయాలి.

  • ఇరాన్ సరిహద్దులలోని సమస్త సమాచారాన్ని పొందే పూర్తి అధికారం IAEAకు ఉంటుంది.
  • ఇరాన్ ప్రాక్సీ నెట్‌వర్క్‌ను విడిచిపెట్టాలి.
  • క్షిపణుల భవిష్యత్ వినియోగం: కేవలం ఆత్మరక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే


మరోవైపు.. ఇరాన్‌పై ట్రంప్‌ మాటల దాడి కొనసాగిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ నౌకాదళం , వైమానిక దళం పూర్తిగా నాశనమయ్యాయని ట్రంప్‌ పేర్కొన్నారు. యుద్ధంలో ఇరాన్​ పూర్తిగా ఓడిపోయిందని, సైన్యంపరంగా వాళ్లు చచ్చిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. అలాగే అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారుచేయకుండా ఉండేందుకు ఇరాన్‌ అంగీకరించిందని తెలిపారు. అంతేకాకుండా.. ఇరాన్‌ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. దాదాపుగా వారి వద్ద ఉన్న ప్రతీదీ పోయింది. టెహ్రాన్‌తో పాటు వారి దేశంలోని ఇతర ప్రాంతాలపై అమెరికా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి’ అని చెప్పారు. ఇదే సమయంలో అమెరికాకు ఇరాన్ హార్మూజ్ జలసంధికి సంబంధించిన ఒక పెద్ద బహుమతి ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ బహుమతి ఏమిటన్న వివరాలను మాత్రం ట్రంప్​ వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement