టామీ లీ వాకర్ కేసు.. అమెరికా న్యాయ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది. తన చేయని తప్పుకు ఉరిశిక్ష అనుభవించిన టామీ లీ వాకర్ కథ ప్రతీ ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. ఈ కేసు మనకు 1950లలో అమెరికాలో నల్లజాతీయ పట్ల వివక్ష ఎలా ఉందో తెలియజేస్తుంది. 1956లో మరణశిక్షకు గురైన టామీ లీని.. ఇప్పుడు దాదాపు 72 ఏళ్ల తర్వాత నిర్దోషిగా కోర్టు తేల్చింది.
ఏమి జరిగిందంటే?
1953లో డాలస్‌లో వెనిస్ పార్కర్ అనే మహిళా అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసులో నల్ల జాతీయుడైన టామీ లీని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లోఅమెరికాలో జాతి వివక్ష ఎక్కువగా ఉండేది. ఈ కేసును విచారించిన జ్యూరీలో అందరూ శ్వేతజాతీయులే ఉన్నారు. దీంతో కేవలం రెండు గంటల విచారణలోనే జ్యూరీ అతనికి మరణశిక్ష విధించింది.
లీకి అనుకూలంగా తొమ్మిది మంది సాక్షులు ఉన్నప్పటికీ కోర్టు వారిని పట్టించుకోలేదు. తానే నేరం చేశానని ఒప్పుకొంటున్నట్లు బలవంతంగా టామీ లీతో సంతకం తీసుకున్నట్లు అప్పటిలో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 1956లో టామీ లీ వాకర్‌ను విద్యుత్ కుర్చీ ద్వారా ఉరితీశారు. చివరి శ్వాస విడిచే వరకు తాను నిర్దోషినని మొరపెట్టుకుంటూనే ఉన్నాడు.
72 ఏళ్ల తర్వాత..
అయితే 72 ఏళ్ల తర్వాత నిజం వెలుగులోకి వచ్చింది. డాలస్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, 'ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్' సంయుక్తంగా పాత కేసులను మళ్లీ విచారణ చేస్తున్నాయి. ఈ క్రమంలో టామీ లీ వాకర్ వారి కంటపడింది. పాత పత్రాలను పరిశీలించిన తర్వాత, వాకర్ ఆ నేరం చేయలేదని తేలింది. అసలు నేరస్థుడు వేరే వ్యక్తి అని నిర్ధారణ అయ్యింది. తన తండ్రి నిరపరాధి అని తేలడంతో టామీ లీ వాకర్ టెడ్ స్మిత్ కన్నీటి పర్యంతమయ్యాడు.


