రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్‌గా ఎదిగిన అమెరికా.. పెద్దన్న పాత్రలో పలు దేశాల్లో తన సైన్యాన్ని మోహరిస్తోంది. పశ్చిమాసియా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో ఈ మోహరింపులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ సంక్షోభాలు, అంతర్యుద్ధాలు, యుద్ధాలు, వాణిజ్య మార్గాల రక్షణ, ఉగ్రవాదం.. ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యంతో మిత్రదేశాలతో ఈ తరహా డీల్ కుదుర్చుకోవాల్సి వస్తోంది. మరి ఏ దేశంలో ఆ ఫిగర్ ఎక్కువగా ఉందో తెలుసా?.. తెలిస్తే మీకు కచ్చితంగా షాకవుతారు.

అమెరికా సైన్యం ఎక్కువగా మధ్యప్రాచ్యంలో లేదంటే యూరప్‌లో ఉంటుందని చాలామంది అనుకుంటారు. తాలిబన్ల దాడుల టైంలో(2001–2021) అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యధికంగా సైనికులను మోహరించింది. 2011 నాటికల్లా ఆ సంఖ్య లక్షకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2021లో చివరి దశలో కేవలం 2,500 సైనికులు మాత్రమే మిగిలి.. అటుపై ఆగస్టు 2021లో పూర్తిగా వెనక్కి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుత గణాంకాల ప్రకారం.. అమెరికా సైన్యం 1,71,500 మంది సైనికులను విదేశాల్లో మోహరించింది. అందులో ప్రపంచంలో అత్యధికంగా మోహరించింది మాత్రం జపాన్‌లోనే!!. ఎందుకిలా?.. జపాన్‌కంటూ సొంత సైన్యం లేదా?.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులేసిన దేశపు సైన్యాన్నే ఎందుకు ప్రొత్సహించాల్సి వచ్చింది?..

అణుబాంబుల తర్వాత..
రెండో ప్రపంచ యుద్ధంలో.. జపాన్ అంత త్వరగా ఓటమిని అంగీకరించలేదు. యుద్ధాన్ని త్వరగా ముగించడానికి, జపాన్‌ను లొంగదీసుకోవడానికి అమెరికా తీవ్ర నిర్ణయం తీసుకుంది. హిరోషిమా, నాగసాకిలపై మూడు రోజుల వ్యవధిలో అణుబాంబులు ప్రయోగించింది. లక్షల సంఖ్యలో మరణాలు.. లెక్కలేనంత మందిపై రేడియేషన్ ప్రభావం. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్లపాటు అమెరికా ఆధీనంలో ఉండిపోయింది జపాన్. ఆ తర్వాత తన వీక్‌నెస్‌ను పసిగట్టింది. తన రాజకీయ, రక్షణ వ్యవస్థను జపాన్ సమూలంగా మార్చుకుంది.

1947లో అమెరికా పర్యవేక్షణలో జపాన్ కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఇందులో “యుద్ధం చేయకూడదు, సైన్యం పెట్టకూడదు” అనే క్లాజ్ ఏర్పాటు చేసుకుంది. సైన్యం కోసం కాకుండా.. ఆర్థిక అభివృద్ధి ఇందుకోసం సాంకేతికత, పరిశ్రమల రంగాలపై దృష్టిసారించాలని నిర్ణయించుకుంది. ఆపై 1951, 1960లో జపాన్ తన రక్షణ బాధ్యతను అమెరికాకు అప్పగిస్తూ US-Japan Security Treaty చేసుకుంది. అప్పుడు ఏర్పడ్డ అమెరికా సైన్యం స్థావరాలు.. ఏమాత్రం తగ్గకుండా మరింత వ్యూహాత్మకంగా పెరిగాయి.
ఆ అవసరం ఎందుకు వచ్చిందంటే..
2026 నాటికి జపాన్‌లో సుమారు 61 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ (35,989), దక్షిణ కొరియా (23,766) ఉన్నాయి. చైనా, ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉండడంతో అమెరికా సైన్య సహాయం తీసుకుంటోంది. ఆ రెండు దేశాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలుపుకోవడం కోసం జపాన్ రక్షణ బాధ్యతకు అమెరికా ముందుకొచ్చింది. పసిఫిక్ సముద్రంలో వాణిజ్య మార్గాలను రక్షించడానికి జపాన్‌లోని స్థావరాలు ఒకినావా, యోకోసుకా, మిసావా ముఖ్యమైనవిగా ఉన్నాయి.

అక్కడే ఎక్కువ..
అమెరికా సైన్యం జపాన్‌లో అత్యధికంగా మోహరించబడింది. మొత్తం మీద జపాన్‌లో 120కి పైగా అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది Okinawa దీవి గురించి. చైనా, తైవాన్, ఉత్తర కొరియా దగ్గరగా ఉండటం వల్ల అమెరికా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇక్కడే అతిపెద్ద ఎయిర్ బేస్ (Kadena Air Base) ఉంది. సుమారు 23,000 పైగా అమెరికా సైనికులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది ఉన్నారు.
అభ్యంతరాలు కూడా..
అయితే.. అమెరికా సైన్యం మోహరింపుపై జపాన్‌లో అభ్యంతరాలూ ఉన్నాయి. స్థావరాల కోసం అధిక భూభాగాన్ని వినియోగించుకోవడం.. తరచూ ప్రమాదాలు.. స్థానికులపై అమెరికా సైనికులు దాడులకు తెగబడడం.. శబ్ధ కాలుష్యంపై ఒకినావా (Okinawa)లో ఇప్పటికీ నిరసనలు జరుగుతుంటాయి. 2025లో రెజల్యూట్ జపాన్ పేరుతో ఇరు దేశాలు ఎయిర్‌షో నిర్వహించాయి. అయితే ‘‘మా దీవులను యుద్ధభూమిగా మార్చొద్దు’’ అంటూ స్థానికులు రోడ్లను బ్లాక్ చేశారు. అమెరికా బేస్‌ల కారణంగానే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదని.. తద్వారా నిరుద్యోగం పెరిగిపోతోందనే విమర్శ ఒకటి ఉంది. అయితే జపాన్ తన రక్షణను స్వయంగా చూసుకోలేని స్థితి. మిత్రదేశం అమెరికాకు ఆ బాధ్యత అప్పగించింది. అందుకే మెజారిటీ ప్రజలు, రాజకీయ వర్గాలు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఒకటుంది.

సైన్యం ఉంది, కానీ..
జపాన్‌కి త్రివిధ దళాలతో కూడిన సొంత సైన్యం ఉంది. దాన్ని జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (JSDF) అంటారు. ఇది 1954లో స్థాపించబడింది. దీని వద్ద ఆధునిక ఆయుధాలు, నౌకలు, యుద్ధవిమానాలు ఉన్నాయి. ప్రస్తుతం అందులో సుమారు 2.5 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. కానీ వీటి ప్రధాన లక్ష్యం రక్షణ మాత్రమే.. దాడి కాదు.
జపాన్ రాజ్యాంగంలోని 9వ ఆర్టికల్ ప్రకారం.. జపాన్ “యుద్ధం చేయదు, దాడి సైన్యం పెట్టదు.”. మరి జేఎస్‌డీఎఫ్ ఏం చేస్తుంది? ప్రధానంగా.. రక్షణ, శాంతి పరిరక్షణ, విపత్తు సహాయం, అంతర్జాతీయ శాంతి మిషన్‌లలో మాత్రమే పాల్గొంటుంది. జపాన్ యుద్ధం కోరుకోదు.. కానీ తన రక్షణ కోసం ఆధునిక సైనిక శక్తిని కలిగి ఉంది. అందువల్ల JSDF “సైన్యం” కంటే “రక్షణ దళం” అనే పేరుతోనే ఎక్కువగా వినిపిస్తుంటుంది.


