చైనాలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను సోషల్ మీడియాలో విమర్శించినందుకు భార్యకు కోర్టు వింత శిక్ష విధించింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన నియు నా అనే మహిళకు, గావో ఫీతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. గావో ఫీ ఒక బొగ్గు గని కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అదే ఆఫీసులో పనిచేసే ఒక వివాహితతో గావో ఫీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం నియుకు తెలియడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె సోషల్ మీడియాలో తన భర్త బండారాన్ని బయటపెట్టింది. అతడు పనిచేసే ఆఫీస్ వివరాలతో, భర్తను తిడుతూ పోస్టులు పెట్టింది. దీంతో గావో ఫీ తన భార్యపై కోర్టులో 'పరువు నష్టం' దావా వేశాడు.
ఈ కేసును విచారించిన న్యాయస్ధానం ఎవరూ ఊహించని తీర్పు ఇచ్చింది. ఒకరు వ్యక్తిగతంగా ఎన్ని తప్పులు చేసినా, చట్టం ప్రకారం అతడి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని కోర్టు తేల్చింది. దీంతో తన భర్తకు వరుసగా 15 రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని నియును కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలు మేరకు జనవరి 12 నుంచి నియు నా క్షమాపణ వీడియోలు పెట్టడం ప్రారంభించింది. అయితే ఆమె మాత్రం చాలా వ్యంగ్యంగా తన భర్తకు సారీ చెబుతోంది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఉద్దేశించి.. "మీ ఇద్దరిది నిజమైన ప్రేమ.
నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ గౌరవాన్ని నేను కాపాడాలి కాబట్టి క్షమించు" అంటూ సెటైర్లు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే కోర్టు ఇచ్చిన ఈ వింత తీర్పుతో ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది. ఆమెకు రోజుల వ్యవధిలోనే 3,50,000 మంది ఫాలోవర్లు వచ్చారు.


