అడవుల్లో చెలరేగిన కార్చిచ్చులు మూగజీవాల ఆవాసాలను బూడిద చేస్తున్నాయి. ఆహారం దొరక్క, ప్రాణాలు కాపాడుకునే దారి లేక అల్లాడుతున్న వన్యప్రాణులను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపంలో మంటల నుంచి కాపాడిన ఎనిమిది ఒరాంగుటాన్లను తిరిగి అడవిలోకి వదిలారు. వీటిలో మూడు తల్లి ఒరాంగుటాన్లు, వాటి మూడు పిల్లలు, మరో రెండు వయోజన ఒరాంగుటాన్లు ఉన్నాయి. పశ్చిమ బోర్నియోలోని ఓ రక్షిత అటవీ ప్రాంతంలో శుక్రవారం వీటిని విడుదల చేసినట్లు జంతు సంరక్షణ సంస్థ ఇంటర్నేషనల్ యానిమల్ రెస్క్యూ ఇండోనేషియా తెలిపింది.
ఇండోనేషియాలో ఏటా ఎండాకాలంలో అడవుల్లో మంటలు చెలరేగుతుంటాయి. అయితే, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో కార్చిచ్చులు మరింత తీవ్రంగా వ్యాపించాయి. దీంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధికారులు మొత్తం 46 ఒరాంగుటాన్లను రక్షించారు. మంటలు అడవులను దహించేయడంతో వాటికి ఆహారం కరువై, జనావాసాలకు దగ్గరగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రక్షించిన వాటిలో మామా నోపీ, ఆమె పిల్లలు నోపీ, నౌఫల్, నోపాన్ ఉన్నాయి. ఇవి కొబ్బరి, రబ్బరు తోటల్లో జీవిస్తుండగా చుట్టుపక్కల అడవులు కాలిపోయాయి. మరోవైపు, మామా లిఫా, ఆమె పిల్ల లిఫా ఆయిల్ పామ్ తోటల మధ్య చిక్కుకుపోయాయి. అలాగే, మామా మ్యాన్, ఆమె పిల్ల మ్యాన్ నివసించే ప్రాంతానికి మంటలు వ్యాపించడంతో వాటి సంచారానికి ఆటంకం ఏర్పడింది. దీంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ ఒరాంగుటాన్లను విడుదల చేసేందుకు ఆహారం, నీరు సమృద్ధిగా లభించే, ఇతర అడవులతో అనుసంధానమైన ప్రాంతాన్ని అధికారులు ఎంపిక చేశారు. దీంతో అవి స్వేచ్ఛగా సంచరిస్తూ సహజ వాతావరణంలో జీవించే అవకాశం ఉంటుందని యియారి ప్రతినిధి అర్జిటో రాంటింగ్ తెలిపారు. రక్షించిన జంతువులు కొత్త ప్రాంతంలో మనుగడ సాగించేలా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణ సంస్థ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంచనాల ప్రకారం.. బోర్నియో, సుమత్రా ద్వీపాల్లో ప్రస్తుతం సుమారు 1,04,000 ఒరాంగుటాన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. శతాబ్దం క్రితం ఈ సంఖ్య 2,30,000కు పైగా ఉండేది. మరోవైపు, బోర్నియోలో ఒరాంగుటాన్ల జనాభాలో 52 శాతం నివసించే ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం హెచ్చరించింది. వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే వాటి ఆవాసాల్లోని చాలా ప్రాంతాలు మనుగడకు అనుకూలంగా ఉండవని ఆందోళన వ్యక్తం చేసింది.
తోటల విస్తరణ కోసం అడవులను తొలగించడం కూడా మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. దట్టమైన అడవులు తగ్గిపోవడంతో ఒరాంగుటాన్లకు ఆహారం, సురక్షితమైన నివాస ప్రాంతాలు కరువవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. దీంతో ఈ అరుదైన వన్యప్రాణులను కాపాడేందుకు వాటి సహజ ఆవాసాలను సంరక్షించడం అత్యవసరంగా మారింది.
ఇదీ చదవండి: మానవాళికి ముప్పు.. అణు యుద్ధం, ఏఐతో..


