
వాష్టింగన్: భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. నేతలు మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వ్యక్తిగతంగా ఉన్న మంచి అనుబంధం ఇప్పుడు మాయమైపోయిందని యూఎస్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘భారత ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్‌నకు మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో భారత్ తీసుకున్న కొన్ని చర్యలే ఇందుకు కారణం కావచ్చు. అమెరికా-భారత్ సంబంధాలను వైట్ హౌస్ దశాబ్దాల వెనక్కి నెట్టింది. మోదీని రష్యా, చైనాకు చేరువ చేసింది. అమెరికా, ట్రంప్‌నకు ప్రత్యామ్నాయంగా బీజింగ్ తనను తాను ప్రదర్శించుకుంది.
అయితే, ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను ఆయా నేతలతో తనకున్న వ్యక్తిగత అనుబంధాల కోణంలో చూస్తారు. ఒకవేళ ఆయనకు పుతిన్‌తో సత్సంబంధాలు ఉంటే.. అమెరికా, రష్యాల మధ్య అనుబంధం ఉంటుంది. కానీ.. వాస్తవానికి ఇది అసాధ్యం. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే. సత్సంబంధాలు కొన్నిసార్లు సాయపడొచ్చు.. కానీ, అన్ని వేళలా రక్షించవు. ప్రస్తుతం భారత్ విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికా- భారత్‌ల మధ్య సుంకాల వివాదం వేళ బోల్టన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదిలా ఉండగా.. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్ బోల్టన్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. అయితే.. ట్రంప్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో రాజీనామా చేశారు. రహస్య పత్రాల దుర్వినియోగం ఆరోపణలపై విచారణలో భాగంగా బోల్టన్‌కు చెందిన నివాసం, వాషింగ్టన్ కార్యాలయంలో ఎఫ్‌బీఐ ఇటీవల సోదాలు నిర్వహించింది.