చాయిస్‌ మీదే: బిల్‌ క్లింటన్‌

Bill Clinton Slams Trump Says US Presidency For Him Like Watching TV - Sakshi

డొనాల్డ్‌ ట్రంప్‌పై డెమొక్రాట్ల విమర్శలు

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనాను కట్టడి చేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం విఫలమైందని అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బిల్‌ క్లింటన్‌ విమర్శించారు. ప్రాణాంతక వైరస్‌ కారణంగా లక్షా డెబ్బై వేల మంది అమెరికా పౌరులు మరణించారని, ఆర్థిక సంక్షోభం తలెత్తి వ్యాపారులు రోడ్డున పడ్డారన్నారు. నిరుద్యోగం పెరిగిందని, లక్షలాది మంది యువత ఉపాధి లేక విలవిల్లాడుతున్నారని ట్రంప్‌ సర్కారుపై ధ్వజమెత్తారు. ఇలాంటి విపత్కర సమయంలో కమాండ్‌ సెంటర్‌గా ఉండాల్సిన శ్వేతసౌధం.. అధ్యక్షుడి అనుచిత సలహాలతో తుపాను కేంద్రంగా మారిందంటూ విమర్శలు సంధించారు.

మరో నాలుగేళ్లు ఆయనకు అధికారం అప్పగిస్తే ఎదుటి వారిపై నిందలు వేయడానికి, ఇతరులపై నోరు పారేసుకోవడానికే సమయం సరిపోదని, అలాంటి వ్యక్తి మెరుగైన పాలన ఎలా అందిస్తారంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికలు అంటే ట్రంప్‌కు టీవీ చూడటం, సోషల్‌ మీడియాలో సమయం గడపడం వంటి విషయమని మండిపడ్డారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని వ్యక్తిని మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించారు. (ఇది నా జీవితాని​కి లభించిన అరుదైన గౌరవం: బిడెన్‌)

కాగా అగ్రరాజ్యంలో నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జో బిడెన్‌ను నామినేట్‌ చేస్తూ డెమొక్రటిక్‌ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా బిడెన్‌ రన్నింగ్‌మేట్‌గా కమలా హారిస్‌ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా బిల్‌ క్లింటన్‌ మాట్లాడుతూ..  అమెరికాకు పూర్వవైభవం రావాలంటే బిడెన్‌కు ఓటు వేయాలని కోరారు. ప్రతీ విషయంలోనూ బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ, దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్లగల సత్తా ఆయనకు ఉందని పేర్కొన్నారు.

‘‘మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి గ్రామీణ అమెరికాను పట్టణాలతో కలపడం, నల్లజాతీయులు, స్థానిక అమెరికన్లు, మహిళలు, వలసదారులు, ఇతర వర్గాలన్నింటినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేసి సమతౌల్య సమాజ నిర్మాణానికి పాటుపడటం, క్లైమేట్‌ చేంజ్‌, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడం, వినూత్న ఆర్థిక విధానాలతో చిరు వ్యాపారులను ఆదుకోవడం వంటి అనేకానేక ప్రణాళికలతో బిడెన్‌ ముందుకు వచ్చారు. (డెమోక్రాటిక్‌ అభ్యర్థులపై నోరు పారేసుకున్న ట్రంప్‌)

ఇలాంటి పనిచేసే అధ్యక్షుడు కావాలో లేదా సోషల్‌ మీడియాలో ఇతరులను పదే పదే కాల్చుకు తింటూ తన వైఫల్యాలను ఇతరులపైకి నెట్టివేసే ట్రంప్‌ కావాలో మీరే నిర్ణయించుకోండి. దేశ భవిష్యత్తు మీ చాయిస్‌ మీదే ఆధారపడి ఉంది’’అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక మరో మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మాట్లాడుతూ‌.. అమెరికా గొప్పదనాన్ని, చరిత్రను నిలబెట్టగల సత్తా జో బిడెన్‌కే ఉందన్నారు. అనుభవం, ఇతరులతో హుందాగా వ్యవహరించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నిజాయితీకి మారుపేరు. నిబద్ధతతో పనిచేసే నాయకుడు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినపుడు బాధ్యతాయుతంగా వ్యవహించే వ్యక్తి. ప్రస్తుతం దేశానికి ఇలాంటి నాయకుడే కావాలి. ఆయన అవసరం దేశానికి ఎంతగానో ఉంది’’అని పేర్కొన్నారు.      

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top