ప్రియుడితో బిల్‌గేట్స్‌ తనయ జెన్నీఫర్‌ పెళ్లి!

Bill And Melinda Gates Daughter Jennifer Gets Married - Sakshi

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌-మిలిందా గేట్స్‌ల కుమార్తె జెన్నీఫర్‌ కేథరిన్‌ గేట్స్‌ వివాహ వేడుక సీక్రెట్‌గా జరిగిపోయింది. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్‌ రైడర్‌ అయిన నాయెల్‌ నాజర్‌తో జెన్నిఫర్‌ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్‌’ మ్యాగజైన్‌ ధృవీకరించింది. వీరి వివాహం న్యూయార్క్‌లో జరిగినట్లు సదరు మ్యాగజైన్‌ ప్రచురించింది. 

కొన్ని నెలల క్రితం మిలిందా గేట్స్‌తో విడాకులు తీసుకున్న బిల్‌గేట్స్‌.. కుమార్తె జెన్నీఫర్‌ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు.  కాగా, కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు.  అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జెన్నీఫర్‌-నాజర్‌ల పెళ్లి జరిగినట్లు పీపుల్‌ మ్యాగజైన్‌ స్పష్టం చేసింది. 

నాజర్‌ది సంపన్న కుటుంబమే..
ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా తరఫున నాజర్‌ ఈక్వెస్ట్రియన్‌(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు.  ఈజిప్టు సంతతికి చెందిన నాయల్‌ నాజర్‌ది సంపన్న కుటుంబమే.  వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్‌లో ఉన్నారట. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్న సమయంలో ప్రేమ చిగురించింది.  చివరకు సోషల్‌ మీడియా వేదికగా జెన్నీఫర్‌ తన ప్రేమ వివాహాన్ని గతేడాదే బైటపెట్టింది. ఆ సమయంలో వీరి ప్రేమకు బిల్‌గేట్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. దానిలో భాగంగానే వీరి పెళ్లికి బిల్‌గేట్స్‌తో పాటు మాజీ భార్య మిలిందాలు దగ్గరుండి జరిపించినట్లు పీపుల్‌ మ్యాగజైన్‌ తెలిపింది. 

నీతో కలిసి ఎదగాలని, నేర్చుకోవాలని, నవ్వాలని ఉంది
‘నాయల్‌ నాజర్‌.. నువ్వు నాకు దొరికిన ఒక అదృష్టానివి. నీతో కలిసి ఎదగాలని, నేర్చుకోవాలని, నవ్వాలని ఉంది. మన జీవితం కలిసి పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది జెన్నీఫర్‌.  ‘ ప్రపంచంలో నేను అదృష్టవంతుడ్నే కాదు.. చాలా హ్యాపీయెస్ట్‌ పర్సన్‌ని కూడా. నువ్వే నా జీవితం. నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ప్రతీ ఉదయాన్ని, ప్రతీ రోజుని ఒక కల అంత అందంగా ఆస్వాదించేలా చేసిన నీకు చాలా థాంక్స్‌’ అని నాజర్‌ తెలిపాడు. 

బిల్‌గేట్స్‌-మిలిందా  మే 4న ప్రకటించిన తర్వాత అది ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఉండలేక విడిపోవడానికే మొగ్గుచూపడంతో అది విడాకులకు దారి తీసింది. దాంతో మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక జీవితానికి బిల్‌గేట్స్‌ ముగింపు పలికినట్లు అయ్యింది.  కాగా, బిల్‌గేట్స్‌ దంపతులకు ముగ్గురు సంతానం. జెన్నీఫర్‌ గేట్స్‌, రోరీ గేట్స్‌, ఫీబీ అడెల్‌ గేట్స్‌. అందరి కంటే పెద్ద అమ్మాయే జెన్నీఫర్‌ గేట్స్‌. ఈమె అంటే తల్లి మిలిందాకు చాలా ఇష్టమట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top