ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ కృత్రిమ మేధ (AI) నేడు ప్రతి రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తోంది. అయితే ఈ ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"రాబోయే నాలుగైదు ఏళ్లలో అటు వైట్ కాలర్, ఇటు బ్లూ కాలర్ ఉద్యోగ రంగాల్లో ఏఐ ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ అసమానతల సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. న్యూ స్కిల్స్‌ను నేర్పించడం లేదా పన్ను వ్యవస్థలో మార్పులు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి.
ఇప్పటివరకు ఏఐ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికి.. భవిష్యత్తులో ఎక్కువగా మార్పులు కనిపిస్తాయి. ఇప్పటికే ఏఐ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, లాజిస్టిక్స్, కాల్ సెంటర్లలో లోయర్ స్కిల్ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ సమస్యలను పరిష్కరించకోకపోతే సంపద, అవకాశాలు కొద్దిమంది చేతుల్లోకి మాత్రమే వెళ్లిపోతాయి. దీంతో సమాజంలో అసమానతలు పెరిగే అవకాశముంది" అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.


