బీరుట్‌ ప్రమాదం: విస్మయకర విషయాలు వెల్లడి | Sakshi
Sakshi News home page

బీరుట్‌ ప్రమాదం: నెల కిత్రమే హెచ్చరించినా

Published Tue, Aug 11 2020 6:28 PM

Beirut Blast Security Sources Warned Lebanon Leaders In July - Sakshi

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుడు ఘటనకు సంబంధించి విస్మయకర విషయాలు బయటికొస్తున్నాయి. ప్రభుత్వాన్ని నెల క్రితమే హెచ్చరించినా చర్యలు చేపట్టకపోవడంతోనే ఇంతటి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోర్టులో ఉన్న 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల వల్ల రాజధాని బీరుట్‌కు ప్రమాదం పొంచి ఉందని సెక్యురిటీ వర్గాలు నెల క్రితమే హెచ్చరించినట్టు ఈ మేరకు రాయిటర్స్‌ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. సెక్యురిటీ వర్గాల హెచ్చరికలకు సంబంధించిన పత్రాలను సదరు వార్తా సంస్థ, కొందరు సీనియర్‌ భద్రతా అధికారులు పరిశీలించారని పేర్కొంది. బీరుట్‌ పేలుడు ఘటన అనంతరం నేషనల్‌ సెక్యురిటీ జనరల్‌ ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2013 నుంచి గోడౌన్లలో ఉన్న అమ్మోనియం నైట్రేట్‌తో  బీరుట్‌కు పెను ప్రమాదం పొంచి ఉందని అధ్యక్షుడు మిచల్‌ అవున్‌, ప్రధాని హసన్‌ డియాబ్‌కు జులై 20న లేఖ రాసిన విషయాన్ని నేషనల్‌ సెక్యురిటీ జనరల్ తాజా రిపోర్టులో ప్రస్తావించారు.
(చదవండి: ‘హైదరాబాద్‌ చేరుకున్న అమ్మోనియం నైట్రేట్‌’)

భారీ స్థాయిలో ఉన్న అమ్మోనియం నిల్వలను సంరక్షించాలని జనవరిలో జ్యుడియల్‌ కమిటీ కూడా చెప్పిందని ఆయన రిపోర్టులో గుర్తు చేశారు. అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు తీవ్రవాదులు దొంగిలించి మారణహోమం సృష్టించే అవకాశం ఉందని, లేదంటే పేలుడు గనుక జరిగితే బీరుట్‌ సర్వనాశనం అవుతుందని ఆ లేఖలో నేషనల్‌ సెక్యురిటీ జనరల్ హెచ్చరించారు. దురదృష్టవశాత్తూ ఆయన‌ హెచ్చరించిన రెండు వారాల అనంతరం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 163 మంది ప్రాణాలు కోల్పోగా 6 వేల మందికి పైగా గాయపడ్డారు. సుమారు 6 వేల భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలాఉండగా.. పేలుడు ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని హసన్‌ దియాబ్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
(చదవండి: నిరసనలు: లెబనాన్‌ ప్రధాని రాజీనామా)

Advertisement

తప్పక చదవండి

Advertisement