Pak: సైన్యం విజయం ఉత్తదే | Baloch insurgents reject Army Jaffar Express operation claim | Sakshi
Sakshi News home page

Pak: సైన్యం విజయం ఉత్తదే

Mar 14 2025 5:32 AM | Updated on Mar 14 2025 7:37 AM

Baloch insurgents reject Army Jaffar Express operation claim

కాల్పులు కొనసాగుతున్నాయి 

పాక్‌ సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది 

జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులు మా అధీనంలో ఉన్నారు 

బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటన 

ఇస్లామాబాద్‌: జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్‌ చేసిన మిలిటెంట్లందరినీ మట్టుబెట్టామంటూ పాకిస్తాన్‌ సైన్యం చేసిన ప్రకటనను బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) గురువారం ఖండించింది. ఆపరేషన్‌ ఇంకా ముగియలేదని, సైన్యంపై కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. యుద్ధక్షేత్రంలో విజయం సాధించినట్లు సైన్యం చెప్పుకుంటోందని, అందులో ఎంతమాత్రం నిజంలేదని వివరించింది. తమ దాడిలో పాక్‌ భద్రతా బలగాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు స్పష్టంచేసింది. 

ఇప్పటికే పాక్‌ సైనికులు చాలామంది మరణించారని పేర్కొంది. శత్రువుపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు బీఎల్‌ఏ ఒక ప్రకటన జారీ చేసింది. చాలామంది ప్రయాణికులు తమ అధీనంలోనే ఉన్నారని ప్రకటించింది. మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్‌ వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. 

33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్‌ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్‌ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్‌ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది. 

సైన్యం తమపై పోరాటం చేయలేక సామాన్య బలూచ్‌ పౌరులను వేధిస్తోందని విమర్శించింది. జైళ్లలో ఉన్న తమ మిలిటెంట్లను వదిలిపెడితే రైలులో మిగిలి∙ఉన్న సైనికులు, ప్రయాణికుల విడుదల చేస్తామని బీఎల్‌ఏ ప్రతిపాదించింది. తమ మాట వినకపోతే జరగబోయే పరిణామాలకు పాక్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. బలూచిస్తాన్‌లో యుద్ధవాతావరణం నెలకొన్న ప్రాంతాలను సందర్శించేందుకు జర్నలిస్టులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక్కడి పరిస్థితులు ఏమిటో బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని బీఎల్‌ఏ స్పష్టం చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement