breaking news
Jaffer express
-
214 మందిని చంపేశాం
ఇస్లామాబాద్: తాము హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లోని 214 మందిని చంపేశామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) మిలిటెంట్లు ప్రకటించారు. మృతుల్లో పాకిస్తాన్ సైనికులతోపాటు సాధారణ ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. పాక్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న తమ సహచరులను విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల గడువు శుక్రవారంతో ముగిసినట్లు పేర్కొ న్నారు. వారి విడుదల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో తమ వద్ద బందీలుగా ఉన్న 214 మందిని అంతం చేసినట్లు తెలియజేశారు. అయితే, దీనికి వారు ఎలాంటి ఆధారాలు చూపలేదు.క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బీఎల్ఏ మిలిటెంట్లు మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రైలులో 440 మంది ప్రయాణికులు ఉన్నారు. మిలిటెంట్ల దాడిలో 21 మంది పౌరులు, నలుగురు సైనికులు మరణించినట్లు తొలుత వార్తలొచ్చాయి. రైలును హైజాక్ చేసిన మిలిటెంట్లందరినీ హతమార్చి ప్రయాణికులను విడుదల చేసినట్టు పాక్ సైన్యం వెల్లడించింది. అయితే, సైన్యం ప్రకటనను మిలిటెంట్లు కొట్టిపారేశారు. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టంచేశారు. మరోవైపు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ... 33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 354 మంది ప్రయాణికులను రక్షించామని చెప్పారు. మిలిటెంట్ల దాడిలో 23 మంది సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు.. మొత్తం 31 మంది మృతిచెందారని వివరించారు. -
కళ్ల ముందే కడతేర్చారు
క్వెట్టా: తమ ప్రాంత స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా సాయుధబాటలో పయనిస్తున్న అతివాద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పాకిస్తాన్లో ఏకంగా ఒక రైలునే తమ అ«దీనంలోకి తెచ్చుకుని ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అయితే ఈ ఘటనలో ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు ఇంకా ఆ దారుణ ఘటన నుంచి తేరుకోలేదు. తమ కళ్ల ముందే పాకిస్తానీ సైనికులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసిన వైనాన్ని వారు గుర్తుచేసుకున్నారు. క్వెట్టా నుంచి పెషావర్‌కు 440 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ రైలుపై మెరుపుదాడి చేసి డజన్లకొద్దీ జనాలను, రైళ్లోని పాక్ సైనికులను బలూచిస్తాన్ వేర్పాటువాదులు చంపేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపడం తెల్సిందే. చిన్నారులు, మహిళలతోపాటు వృద్ధులను వేర్పాటువాదులు ఇప్పటికే మానవతా దృక్పథంలో వదిలేయడంతో ఘటనాస్థలిలో వివరాలను ఆ వృద్దులు మీడియాతో పంచుకున్నారు. బోగీలపైకి బుల్లెట్ల వర్షం ‘‘రైలు బోలన్ కనుమ సమీపానికి రాగానే పెద్ద పేలుడు జరిగింది. పట్టాలను వేర్పాటువాదులు పేల్చేశారు. దీంతో రైలు హఠాత్తుగా ఆగింది. రైలు ఆగీఆగడంతోనే బోగీలపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సీట్ల కింద దాక్కున్నాం’’అని మహబూబ్ హుస్సేన్ అనే వృద్ధుడు చెప్పారు. తర్వాత విడుదలైన ఒక రైల్వే పోలీసు అధికారి ఈ ఘటనను వివరించారు. ‘‘ రైలు ఆగాక వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు కిందకు దిగొచ్చి రైలును చుట్టుముట్టి కాల్పులు మొదలెట్టారు. నేను, నలుగురు రైల్వే పోలీసులు, ఇద్దరు పాకిస్తానీ పారా మిలటరీ ఫ్రంటియర్ కోర్ సభ్యులందరం కలిసి వేర్పాటువాదులను ఎదుర్కొనేందుకు ప్రయతి్నంచాం. మా వద్ద మందుగుండు అయిపోయేదాకా ప్రతిఘటించాం. తర్వాత మా వద్ద బుల్లెట్లు అయిపోయాయి. చివరకు చేతులెత్తేయక తప్పలేదు ’’అని రైల్వే పోలీసు అధికారి చెప్పారు. గుంపులుగా వేరుచేసి.. ‘‘అందర్నీ కిందకు దించి ఐడీ కార్డులు అడిగారు. పోలీసులు, మహిళలు, వృద్దులు, చిన్నారులు ఇలా వేర్వేరు గుంపులుగా నిల్చోబెట్టారు. ‘ప్రభుత్వానికి డిమాండ్లు పంపించాం. అవి నెరవేరితే సరే. లేదంటే ఎవ్వరినీ వదిలిపెట్టం’’అని మాతో చెప్పారు. వాళ్లకు పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లు వాళ్లు కొందరు సాధారణ పౌరులను, సైనికులను చంపుకుంటూ వెళ్లారు. మా కళ్లముందే ఈ ఘోరం జరిగింది’’అని మరో ప్రత్యక్ష సాక్షి ఇషాక్ నూర్ చెప్పారు. ‘‘అందర్నీ కిందకు దింపి ముసలివాళ్లను వదిలేశారు. వెనక్కి తిరిగి చూడకుండా ఇలాగే పట్టాల వెంట వెళ్లిపోవాలని నన్ను, నా భార్యను హెచ్చరించారు. బతుకుజీవుడా అనుకుంటూ అలాగే నడిచి రాత్రి ఏడుగంటలకు పనీర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాం’’అని భర్త నూర్ మొహమ్మద్ చెప్పారు. ‘‘పిల్లలు, మహిళలు ఉన్నారు వదిలేయండని ఎంతో వేడుకుంటే మమ్మల్ని వదిలేశారు. మంగళవారం రాత్రి అక్కడి నుంచి బయటపడ్డాం. అందరం కలిసి ఏకధాటిగా నాలుగు గంటలపాటు నడిచి తర్వాతి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాం’’అని ముహమ్మద్ అష్రఫ్ అనే వ్యక్తి చెప్పారు. పారిపోబోయిన కొందర్ని చంపేశారని పోలీసు అధికారి చెప్పారు. ‘‘రాత్రి పొద్దుపోయాక వేర్పాటువాదుల్లో కొందరు అక్కడి నుంచి ని్రష్కమించారు. అదే సమయంలో కొందరు ప్రయాణికులు తప్పించుకునేందుకు విఫలయత్నంచేశారు. బందీలు తప్పించుని పరుగెత్తడం చూసిన సాయుధాలు వాళ్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో వాళ్లంతా పిట్టల్లా పడి బుల్లెట్లకు బలయ్యారు’’ అని చెప్పారు.కొందర్ని కిడ్నాప్ చేసి వెంట తీసుకెళ్లిన వేర్పాటువాదులు 440 మంది ప్రయాణికుల్లో 300 మందిని విజయవంతంగా విడిపించామని పాక్ సైన్యం చెబుతోంది. అయితే మిగతా 140 మంది పరిస్థితి ఏంటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. డజన్ల మంది చనిపోయారని వార్తలొచ్చాయి. అయితే మిగతా వారిని వేర్పాటువాదులు బంధించి తమ వెంట తీసుకెళ్లారని రాయిటర్స్, ఏఎఫ్‌పీ వార్తాసంస్థలు కథనాలు వెలువర్చాయి. దీనిపై పాక్ సైన్యం స్పందించలేదు. మిగతా ప్రయాణికుల్లో కొందరు పారిపోయి కొండల్లో దాక్కున్నారని, ఘటనాస్థలి చుట్టుపక్కన విస్తృతస్థాయి గాలింపు తర్వాత మరణాలు, బందీలు, విడుదలైన వారి సంఖ్యలపై స్పష్టత వస్తుందని సైన్యం చెబుతోంది. క్వెట్టాలో ఖాళీ శవపేటికలు ఘటనలో చనిపోయి విగతజీవులుగా ఇంకా ఘటనాస్థలిలో అనాథలుగా పడిఉన్న వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు క్వెట్టా నుంచి రైలు బుధవారం బలూచిస్తాన్ వైపు బయల్దేరింది. డజన్ల కొద్దీ ఖాళీ శవపేటికలను రైలులోకి ఎక్కించారని అక్కడి వారు చెప్పారు. మరోవైపు ఉదయం ప్రార్థనల వేళ కొందరు ప్రయాణికులు చాకచక్యంగా తప్పించుకున్నారు. ‘‘రంజాన్ మాసం కావడంతో బుధవారం ఉదయం పూట వేర్పాటువాదులు ప్రార్థనలకు సిద్ధమయ్యారు. ఫజర్ కోసం వేర్పాటువాదులు బిజీగా ఉండటంతో ఇదే అదునుగా భావించి పాకిస్తాన్ రెస్క్యూ బృందాలు దాడి చేశాయి. దీంతో పోలీసులను ఎదుర్కోవడంపైనే వేర్పాటువాదులు దృష్టిసారించారు. అదే సమయంలో కొందరు పారిపోయారు. ‘‘తప్పించుకునే క్రమంలో మాలో కొందరికి బుల్లెట్ గాయాలయ్యాయి. అయినాసరే ఏమాత్రం భయపడక క్షతగాత్రులను భుజాలపై మోస్తూ పరుగెత్తాం. ఎట్టకేలకు కొండకు సుదూరంగా చేరుకోవడంతో వేర్పాటువాదుల తుపాకీ గురి నుంచి తప్పించుకోగలిగాం’’అని అల్లాహ్దితా చెప్పారు. -
Pak: సైన్యం విజయం ఉత్తదే
ఇస్లామాబాద్: జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన మిలిటెంట్లందరినీ మట్టుబెట్టామంటూ పాకిస్తాన్ సైన్యం చేసిన ప్రకటనను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) గురువారం ఖండించింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని, సైన్యంపై కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. యుద్ధక్షేత్రంలో విజయం సాధించినట్లు సైన్యం చెప్పుకుంటోందని, అందులో ఎంతమాత్రం నిజంలేదని వివరించింది. తమ దాడిలో పాక్ భద్రతా బలగాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు స్పష్టంచేసింది. ఇప్పటికే పాక్ సైనికులు చాలామంది మరణించారని పేర్కొంది. శత్రువుపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు బీఎల్ఏ ఒక ప్రకటన జారీ చేసింది. చాలామంది ప్రయాణికులు తమ అధీనంలోనే ఉన్నారని ప్రకటించింది. మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. 33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది. సైన్యం తమపై పోరాటం చేయలేక సామాన్య బలూచ్ పౌరులను వేధిస్తోందని విమర్శించింది. జైళ్లలో ఉన్న తమ మిలిటెంట్లను వదిలిపెడితే రైలులో మిగిలి∙ఉన్న సైనికులు, ప్రయాణికుల విడుదల చేస్తామని బీఎల్ఏ ప్రతిపాదించింది. తమ మాట వినకపోతే జరగబోయే పరిణామాలకు పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. బలూచిస్తాన్‌లో యుద్ధవాతావరణం నెలకొన్న ప్రాంతాలను సందర్శించేందుకు జర్నలిస్టులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక్కడి పరిస్థితులు ఏమిటో బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని బీఎల్ఏ స్పష్టం చేసింది. -
బాంబు పేలుడు: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
కరాచీ: పాకిస్థాన్ సింధు ప్రావెన్స్లో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో ట్రాక్‌పై వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది రైలు ప్రయాణికులు గాయపడ్డారని పాకిస్థాన్ రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రావల్పిండి నుంచి క్విట్టాకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. పేలుడు వల్ల రైల్వే ట్రాక్ ధ్వంసమైందని... సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను వేరే మార్గంలో నడిపిస్తున్నట్లు వివరించారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఏ సంస్థ ప్రకటించలేదు.