ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు.. భారతీయులకు తీవ్ర హెచ్చరికలు జారీ

Avoid Non Essential Travel To And Within Ukraine Says India - Sakshi

న్యూఢిల్లీ/కీవ్‌: ఉక్రెయిన్‌లో మళ్లీ దాడులు ఉధృతం కావడంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ వెళ్తున్నవాళ్లకు, ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులకు సోమవారం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. అనవసర ప్రయాణాలొద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని వారిని కోరింది.

రాజధాని కీవ్‌ నగరంతో పాటు ఉక్రెయిన్‌లోని పలు చోట్ల రష్యా మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. భారత్‌ ఈ మార్గదర్శకాలను జారీ చేయడం గమనార్హం. సుమారు 84కిపైగా మిస్సైల్స్‌ ఉక్రెయిన్‌ భూభాగంలో విధ్వంసం సృష్టించగా.. సుమారు పది మంది పౌరులు మృతి చెందారని, మరో 60 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. 

ఉక్రెయిన్‌లో ప్రస్తుతం పెరుగుతున్న దాడుల దృష్ట్యా.. భారతీయ పౌరులు ఉక్రెయిన్‌కు, ఉక్రెయిన్‌ లోపల కూడా అన్ని అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వం,  స్థానిక అధికారులు జారీ చేసిన రక్షిత, భద్రతా మార్గదర్శకాలను వారు ఖచ్చితంగా పాటించాలి అని ఉక్రెయిను్‌ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి అడ్వైజరీ విడుదల అయ్యింది. 

ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులు వాళ్ల వాళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎంబసీకి తెలియజేయాలని, తద్వారా సాయం విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదని పేర్కొంది. 

మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరుల మరణాలతో సహా ఉక్రెయిన్‌లో సంఘర్షణ తీవ్రతరం కావడంపై భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోంది అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి పేర్కొన్నారు. యుద్ధవిరమణకు తక్షణ పిలుపు ఇచ్చారాయన. మరోవైపు.. ఇప్పటిదాకా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను భారత్‌ ఖండించింది లేదు. దౌత్యం-చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతూ వస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top