గాజాకు అండగా మేముంటాం: అమెరికా

Antony Blinken announces American aid to Gaza - Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన గాజాకు అండగా మేముంటాం అని అమెరికా పేర్కొంది. గాజా అభివృద్ధి కోసం అంతర్జాతీయంగా మద్దతు కూడగడతామని అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్‌ ప్రకటించారు. అయితే, ఆ సాయం హమాస్‌ పాలకుల చేతుల్లోకి వెళ్లకుండా చూస్తామన్నారు. ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య 11 రోజలపాటు జరిగిన యుద్ధంలో దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోగా, అసలే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న గాజా నగరం తీవ్ర విధ్వంసాన్ని చవిచూసింది. శుక్రవారం రెండు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బ్లింకెన్‌ ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. 

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భేటీ అనంతరం బ్లింకెన్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రాంతంలో మళ్లీ హింస తలెత్తరాదంటే ముందుగా కొన్ని అంశాలను, సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. ముందుగా గాజా పునర్నిర్మాణం ప్రారంభించి, మానవతా సాయాన్ని అందజేయాలి. ఈ విషయంలో అమెరికా ముందుంటుంది. అంతర్జాతీయ మద్దతును కూడా కూడగడుతుంది. పునర్నిర్మాణ సాయంతో హమాస్‌ లబ్ధి పొందకుండా చూసుకుంటాం’ అని బ్లింకెన్‌ తెలిపారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య చర్చలను మళ్లీ ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదని బ్లింకెన్‌ ఈ సందర్భంగా అన్నారు. 

జెరూసలేం కాన్సులేట్‌ను తిరిగి తెరుస్తాం 
జెరూసలేంలోని కాన్సులేట్‌ కార్యాలయాన్ని మళ్లీ తెరుస్తామని బ్లింకెన్‌ ప్రకటించారు.  పాలస్తీనాతో దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ ఈ కాన్సులేట్‌ చాలా కాలంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తోంది. అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చిన ట్రంప్‌ ప్రభుత్వం ఈ కాన్సులేట్‌ హోదాను తగ్గించడం పాలస్తీనియన్లకు ఆగ్రహం తెప్పించింది.

చదవండి: 

విద్యార్థులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top