పంజాబ్‌ సీఎం కూతురు సహా.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు ఖలీస్తానీ గ్రూపుల బెదిరింపులు

Amritpal Singh Hunt: Khalistanis threat Mann Daughter And Students - Sakshi

ఢిల్లీ: పాక్‌ ప్రేరేపిత ఖలీస్తానీ సానుభూతిపరుడు, వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం గాలింపు ఉధృతం అయిన తరుణంలో.. ఖలీస్తానీ మద్దతుదారులు తీవ్ర చర్యలకు దిగుతున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులపై దాడులు చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మేరకు తమకు బెదిరింపు లేఖలు, మెయిల్స్‌, సందేశాలు వచ్చినట్లు పలువురు విద్యార్థులు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలు వాపోతున్నాయి. 

ఈ క్రమంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూతురు సీరత్‌ కౌర్‌కు సైతం ఈ బెదిరింపులు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ చెప్పారు. సియాటెల్(సీటెల్‌)లో ఉంటున్న సీరత్‌ కౌర్‌కు చంపేస్తామని బెదిరింపులు వెళ్లాయట. ఈ మేరకు ఆమెకు భద్రత కల్పించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని స్వాతి మలివాల్‌ కోరుతున్నారు. 

మరోవైపు ఈ బెదిరింపులకు సంబంధించిన విషయాన్ని హర్మీత్‌ బ్రార్‌ అనే అడ్వొకేట్‌ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ప్రస్తావించారు. బెదిరించినంత మాత్రానా?.. పిల్లలను తిట్టినంత మాత్రానా మీకు ఖలీస్తాన్‌ సిద్ధిస్తుందా? అని ఖలీస్తానీ మద్దతుదారులను ఉద్దేశించి పోస్ట్‌చేశారు. బెదిరింపులను సీరత్‌ కౌర్‌ తల్లి ఇందర్‌ప్రీత్‌ కౌర్‌ గ్రెవాల్‌ ధృవీకరించారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తమను వదిలేయాలంటూ ఆమె ఖలీస్తానీలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక.. స్థానిక గురుద్వారా నుంచే ఈ బెదిరింపులు వచ్చినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉంటే.. ఇందర్‌ప్రీత్‌, భగవంత్‌ మాన్‌కు మొదటి భార్య. వీళ్లకు ఇద్దరు సంతానం. కూతురు సీరత్‌, కొడుకు దిల్షాన్‌ ఉన్నారు. 2015 నుంచి వీళ్లిద్దరూ విడిగా ఉంటుండగా.. తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆపై కొడుకు, కూతురితో ఇందర్‌ప్రీత్‌ విదేశాలకు వెళ్లి స్థిరపడింది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది మాన్‌, గుర్‌ప్రీత్‌ కౌర్‌ అనే వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నారు. 

ఖలీస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమెరికాకు చెందిన వేర్పాటువాద గ్రూప్, ‘సిక్స్‌ ఫర్ జస్టిస్’..  విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్‌ బయటకు వచ్చాయి కూడా. అమెరికాతో పాటు యూరప్‌, ఆస్ట్రేలియాలో ఉన్న  పలు ప్రాంతాల్లోనూ ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

ఖలీస్తానీ నేత(ఉగ్రవాది) జర్నైల్‌ సింగ్‌ భింద్రావాలేకు ప్రతిరూపంగా.. భింద్రావాలే 2.0 గా అమృత్‌పాల్‌సింగ్‌ను పిలుచుకుంటున్నారు ఖలీస్తానీ మద్దతుదారులు. గత 14 రోజులుగా అతని ఆచూకీ కోసం పంజాబ్‌ పోలీసులు విస్తృతంగా గాలింపు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని అనుచరులను వంద మందికిపైగా అరెస్ట్‌ చేసి.. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు పలు ప్రాంతాలు తిరుగుతూ, వేషాలు మారుస్తున్న అమృత్‌పాల్‌ సింగ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top