
ఢాకా/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసిన పక్షంలో చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్ సలహాదారు ఏఎల్‌ఎం ఫజ్రుల్ రెహ్మన్ బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో మంగళవారం బెంగాలీలో రాసుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ సందర్భంగా ఏఎల్‌ఎం ఫజ్రుల్ రెహ్మన్..‘భారత ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకు సంయుక్త సైనిక ఏర్పాట్ల కోసం చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని అందులో సూచించారు. ఇక, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్‌కు రహ్మాన్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అయితే, ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇటువంటి వాటిని తాము ప్రోత్సహించం, బలపరచం అని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టవద్దని కూడా కోరింది. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలన్నదే తమ అభిమతమని వివరించింది.
ఇదిలా ఉండగా.. భారత్ విషయంలో పాకిస్తాన్ మరో స్టాండ్ తీసుకున్నట్టు సమాచారం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించడాన్ని నిరసిస్తూ ఢిల్లీకి లాంఛనంగా దౌత్య నోటీసు ఇవ్వాలని పాకిస్తాన్ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ప్రెస్ న్యూస్ వార్తా కథనం వెల్లడించింది. పాక్ విదేశీ, న్యాయ, జలవనరుల మంత్రిత్వశాఖల మధ్య జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.