పంజ్‌షీర్‌.. ముగిసిన పోరు! ప్రతిఘటన దళాల ఓటమి, పంజ్‌షీర్‌లో ఎగిరిన తాలిబన్ల జెండా

Afghanistan Panjshir Valley Completely Captured By Talibans - Sakshi

అఫ్గనిస్తాన్‌లో హోరాహోరీగా సాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు ముగిసింది!. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. 
 
అఫ్గనిస్తాన్‌లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ తెలిపాడు. మరోపక్క పంజ్‌షీర్‌ ప్రావిన్సియల్‌ గవర్నర్‌ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కావాల్సి  ఉంది. అయితే తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుపెట్టామని పంజ్‌షీర్‌ యోధులు ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం.
 

చదవండి: పోరాటాల గడ్డ.. పంజ్‌షీర్‌

మరోవైపు పంజ్‌షీర్‌ సాయుధ దళాల నేత అహ్మద్‌ మసూద్‌ పోరాటం పక్కనపెట్టి,  చర్చల కోసం హస్తం చాస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించాడు. అయితే ఆయుధం పక్కనపెట్టే ప్రసక్లే లేదని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తాజా ‘పంజ్‌షీర్‌ కైవసం’ ప్రకటన కథనాలపై స్పందించేందుకు అహ్మద్‌ అందుబాటులో లేకుండా పోయాడు.  ఆయన పరారీలో ఉన్నట్లు లోకల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అఫ్గన్‌ జాతీయ ప్రతిఘటన దళాల ప్రతినిధి, అఫ్గన్‌ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడు ఫహిమ్‌ దాష్టీని తాలిబన్లు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. అయితే పాక్‌ దళాలు జరిపిన డ్రోన్‌ బాంబు​ దాడుల్లో ఆయన మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పాక్‌ సహకారంతో తాలిబన్లు పంజ్‌షీర్‌ను కైవసం చేసుకుందని అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు కొందరు సోషల్‌ మీడియాలో ఆరోపిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో పంజ్‌షీర్‌లో మారణహోమం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

చదవండి: భారీ నష్టం తాలిబన్లకేనా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top