
కాబూల్‌లో మహిళా ఆందోళనకారులపై తుపాకి ఎక్కుపెట్టిన తాలిబన్
కాబూల్: అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో పాకిస్తాన్ జోక్యాన్ని నిరసిస్తూ మంగళవారం వందలాది మంది కాబూల్ రోడ్లెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ సహాయ సహకారాలు అందించిందని, పాక్ వైమానిక దాడులు జరిపి పంజ్‌షీర్ తాలిబన్ల పరం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్ లీవ్ అఫ్గానిస్తాన్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
పాక్ ఆడించినట్టు ఆడే ప్రభుత్వం తమకు వద్దని, సమ్మిళిత ప్రభుత్వమే కావాలని డిమాండ్లు చేశారు. మరోవైపు నిరసనకారులను చెదరగొట్టడానికి తాలిబన్ కమాండర్లు గాల్లో కాల్పులు జరిపారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. నిరసన ప్రదర్శనల కవరేజ్ చేస్తున్న జర్నలిస్టుల్ని తాలిబన్లు అరెస్ట్ చేసినట్టుగా అఫ్గాన్‌లో టోలో న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
హెరాత్‌లో పాక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శలపై తాలిబన్లు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇద్దరి మృతదేహాలను నగర కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పంజ్‌షీర్‌లో విదేశీ జెట్లు దాడులు జరపడంపై ఇరాన్ కూడా తాలిబన్లను నిలదీసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
చదవండి: చమన్ బోర్డర్‌ను మూసేసిన పాక్