ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడమే లక్ష్యంగా అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ(ADCDA) మరో కీలక అడుగు వేసింది. అగ్ని ప్రమాదాల నివారణ, గృహోపకరణాల భద్రత వంటి ఆంశాలపై అవగాహన పెంచేందుకు “మీ ఇల్లు మీ బాధ్యత” అనే కార్యక్రమాన్ని ఎడిసిడిఎ ప్రారంభించింది.
ఈ ప్రచారంలో భాగంగా సివిల్ డిఫెన్స్ అధికారులు నేరుగా నివాసాలకు చేరుకుని అక్కడి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తారు. ప్రధానంగా ఇళ్లలో జరిగే అగ్నిప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి సారించారు. వంటగదిలో గ్యాస్ స్టౌవ్, ఆయిల్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన కల్పించనున్నారు.
అదేవిధంగా స్మోక్ డిటెక్టర్ల యంత్రాల ప్రాముఖ్యతను కూడా వివరించనున్నారు. యూఏఈ ప్రభుత్వం ఇళ్లలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ ఫైర్ అలారం వ్యవస్థ ‘హసన్తుక్’ కొనసాగింపుగా ఈ ప్రచారం జరుగుతోంది. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఎడిసిడిఎ నిర్ణయించింది. అంతేకాకుంగా త్వరలోనే వీటిపై మాక్ డ్రిల్స్, వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు.


