32 మంది మృతి.. వందల మందికి గాయాలు | 32 dead 200 injured in earthquake in philippines | Sakshi
Sakshi News home page

32 మంది మృతి.. వందల మందికి గాయాలు

Jun 8 2026 4:24 PM | Updated on Jun 8 2026 4:39 PM

32 dead 200 injured in earthquake in philippines

మనీలా: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం సమీపంలో ఈ రోజు సోమవారం ఉదయం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ  32 మంది మరణించారు. 200కు పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు ప్రకటించారు.

దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్‌లో భూకంప తీవ్రతకు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 17 మంది మరణించారని, గ్లాన్ అనే పర్వత ప్రాంత పట్టణంలో 13 మంది గ్రామస్థులు మరణించారని తెలిపారు. కాగా ఈ రోజు ఉదయం ఫిలిప్పీన్స్‌లో తీవ్ర స్థాయిలో భూకంపం నమోదైంది. రిక్టర్‌ స్కేలుపై 8.2 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు తొలుత అధికారులు ప్రకటించారు. అనంతరం దానిని 7.8కి సవరించారు.

భూకంపం వచ్చిన వెంటనే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల్లో సుమారు 3 అడుగుల (1 మీటరు) ఎత్తులో అలలు ఎగిసిపడటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. దీంతో వేలాదిగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

భయంతో పరుగులు తీసిన ప్రజలు
భూకంపం సంభవించిన వెంటనే పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలిపోవడం, ప్రజలు అరుస్తూ బయటకు పరుగులు తీయడం కనిపించింది. ఓ పాఠశాలలో విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జనరల్‌ సాంటోస్‌ నగరంలో ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్‌, ఇతర గృహోపకరణాలు కిందపడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని వాణిజ్య భవనాలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement