కొలంబో: శ్రీలంకలోని ఓ జైల్లో ఖైదీలు తీవ్ర ఘర్షణకు దిగారు. దీంతో 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి తీవ్రగాయాలయ్యాయి. అంతమంది ఖైదీలు ఘర్షణ పడుతున్న సమయంలో అక్కడి పోలీసులు ఏమీ చేయలేకపోయారు.
మృతుల్లో నలుగురు గార్డులు ఉన్నారని అధికారులు తెలిపారు. గత ఐదేళ్లలో శ్రీకంలోని జైళ్లలో ఇంతటి ఘౌరమైన అల్లర్లు ఎన్నడూ జరగలేదని చెప్పారు. రాజధాని కొలంబోకు ఉత్తర దిశలో ఉన్న నెగొంబో ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు.
"కొంతమందికి తుపాకీ గాయాలు ఉన్నాయి. ఇంకొందరికి కత్తి కోతలు, తీవ్ర గాయాలు ఉన్నాయి" అని అధికారులు తెలిపారు. నెగొంబో జైలులో ఆదివారం సాయంత్రం ఘర్షణలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ జైలులో వేలాది మంది ఖైదీలు ఉన్నారు.
ఘర్షణల వార్తలు జైలు అంతటా వ్యాపించడంతో పక్కనే ఉన్న విభాగంలోని మహిళా ఖైదీలు ఆదివారం రాత్రి భవనం పైకప్పుపైకి ఎక్కి తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పైకప్పులో ఓ భాగం కూలిపోవడంతో కొంతమంది మహిళలకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం పోలీసు కమాండోలను పిలిపించినా వారిని జైలు లోపలికి పంపలేదు.
సోమవారం ఖైదీల బంధువులు పెద్ద సంఖ్యలో జైలు బయటకు చేరుకున్నారు. పరిస్థితిని గమనించేందుకు వైమానిక దళం డ్రోన్లు, హెలికాప్టర్‌ను వినియోగించింది. స్థానికులు తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నామని తెలిపారు. సోమవారం ఉదయం పరిస్థితి అదుపు తప్పిందని ఓ పోలీసు అధికారి ఏఎఫ్‌పీకి తెలిపారు.
కాగా, గతంలోనూ శ్రీలంకలోని జైళ్లలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2020 డిసెంబరులో శ్రీలంకలోని మరో జైలులో జరిగిన అల్లర్లలో 11 మంది ఖైదీలు మరణించారు. 117 మంది గాయపడ్డారు. ఆ సమయంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుండటంతో రద్దీగా ఉన్న జైళ్ల నుంచి వందలాది మంది ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం నాటికి శ్రీలంక జైళ్లలో 41,250 మంది ఖైదీలు ఉన్నారని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇది ఆ జైళ్ల సామర్థ్యం కన్నా దాదాపు 4 రెట్లు ఎక్కువ.


