బహుబలి.. బల్దియా
సాక్షి, సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మరింతగా విస్తరించనుంది. ఇప్పటికే దాదాపు 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కార్పొరేషన్ దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల మేరకు పెరగనుంది. జీహెచ్‌ఎంసీ వెలుపల ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు, దానిని ఆనుకొని ఉన్న 27 యూఎల్‌బీలను (కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు) జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రభుత్వ ప్రతిపాదనకు మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం పంపిన మెమోను జీహెచ్‌ఎంసీ యంత్రాంగం పాలకమండలి సమావేశం ముందుంచింది.
జీహెచ్‌ఎంసీ చట్టం–1955 మేరకు ఈ ప్రతిపాదనపై పరిశీలించి, అవసరమైన అధ్యయనం నిర్వహించి జీహెచ్‌ఎంసీ తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ఈనెల 21వ తేదీన ప్రభుత్వం జారీ చేసినఈ మెమోను వివరిస్తూ, ఆ మేరకు టేబుల్ అజెండాగా సమావేశం ముందుంచారు. సర్వసభ్య సమావేశం ఈ ప్రియాంబుల్‌కు ఆమోదం తెలిపింది. ఇక జీహెచ్‌ఎంసీలో 27 యూఎల్‌బీల విలీనం కేవలం లాంఛనమే నన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరానికి ఆనుకునే ఉన్నప్పటికీ పలు యూఎల్‌బీలలో అభివృద్ధి అసమానంగా ఉందని, మౌలిక వసతుల్లో తేడాలున్నాయని, పట్టణీకరణ పెరిగిందని ప్రభుత్వం మెమోలో పేర్కొంది. జీహెచ్‌ఎంసీని ఆనుకునే ఉన్నప్పటికీ, యూఎల్‌బీలకు తగిన సేవలందడం లేవని అభిప్రాయపడింది. అందరికీ సమాన సేవలు, సమాన అభివృద్ధి కోసం విలీనం అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది.
విలీనంతో..
విలీనమయ్యే ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా వ్యవహరిస్తున్నారు. విలీనంతో మాస్టర్ ప్లానింగ్, రవాణా కనెక్టివిటీ తదితర మౌలిక వసతులు మెరుగవడంతోపాటు ఆ ప్రాంతం వరకు ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చి అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇంకా, ట్రాఫిక్ పరంగా, పర్యావరణపరంగా ఒత్తిడి తగ్గుతుంది. సమర్థమైన విపత్తు నిర్వహణ సాధ్యమవుతుంది. పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. రోడ్లు, పారిశుద్ధ్యం, నీటిసరఫరా తదితర సదుపాయాలు అందరికీ సమానంగా అందుతాయి. పరిపాలన సామర్థ్యం, డిజిటల్ గవర్నెన్స్ మెరుగవుతాయి. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, పట్టణ ప్రణాళిక ఒకే గొడుగు కిందకు వస్తుందని అంచనా వేస్తోంది.
ఇబ్బందులు..
శివారు నగర, పురపాలికలు జీహెచ్‌ఎంసీలో విలీనం కావడం వల్ల ఆస్తిపన్ను భారం పడే అవకాశముంది. అలాగే ట్రేడ్ లైసెన్స్, ఇతర ఫీజుల వడ్డన కూడా మున్సిపాలిటీలతో పోలిస్తే అధికంగా ఉంటుంది. దీనికితోడు భవన నిర్మాణ అనుమతుల ఫీజులు కూడా పెరిగే అవకాశంలేకపోలేదు. విలీనం వల్ల శివారు యూఎల్‌బీల్లో రాజకీయ పదవులు తగ్గుతాయి. జీహెచ్‌ఎంసీలో విలీనం తర్వాత జీహెచ్‌ఎంసీ మొత్తం ఒకే కార్పొరేషన్‌గా ఉంటుందో, ఎక్కువ కార్పొరేషన్లుగా మారుతుందో పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఒకే కార్పొరేషన్ అయితే పాలనాపర ఇబ్బందులుంటాయి. ఇప్పటికే ట్రాఫిక్ చిక్కులతో జీహెచ్‌ఎంసీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గంటల సమయం పడుతుండటం తెలిసిందే.
మారనున్న జీహెచ్‌ఎంసీ రూపురేఖలు
ఔటర్ వరకు యూఎల్‌బీలు జీహెచ్‌ఎంసీలో విలీనం
పాలకమండలి ముందుకు అంశం
15 తూంకుంట 16 కొంపల్లి 17 దుండిగల్ 18 బొల్లారం 19 తెల్లాపూర్ 20 అమీన్‌పూర్ 21 బడంగ్‌పేట్ 22 బండ్లగూడ జాగీర్ 23 మీర్‌పేట్ 24 బోడుప్పల్ 25 పీర్జాదిగూడ 26 జవహర్‌నగర్ 27 నిజాంపేట్
1 పెద్ద అంబర్‌పేట్ 2 జల్‌పల్లి 3 శంషాబాద్ 4 తుర్కయంజాల్ 5 మణికొండ 6 నార్సింగి 7 ఆదిబట్ల 8 తుక్కుగూడ 9 మేడ్చల్ 10 దమ్మాయిగూడ 11 నాగారం 12 పోచారం 13 ఘట్‌కేసర్ 14 గుండ్లపోచంపల్లి
విలీనంతో పెరగనున్న జీహెచ్‌ఎంసీ పరిధి
ప్రాంతం విస్తీర్ణం ఓటర్లు జనాభా
(దాదాపు)
జీహెచ్‌ఎంసీ 625 98,74,600 1,45,15,662
కంటోన్మెంట్ 40.17 2,53,636 3,72,844
27 యూఎల్‌బీలు 1317.73 13,72,094 20,16,978
మొత్తం జనాభా : 1,69,05 485


