నిధులజల్లు
ఒక్కో కార్పొరేటర్‌కు రూ.2 కోట్లు
● మౌలిక సదుపాయాలకు కేటాయింపు
● మూడునెలల గడువులోపు రూ. 300 కోట్లు
● జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఆమోదం
● కార్పొరేటర్ల కంటే ఎమ్మెల్యేలకే ఎక్కువ సమయం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగియవస్తున్న తరుణంలో కార్పొరేటర్లకు స్పెషల్ ఫండ్ అందింది. ఒక్కో కార్పొరేటర్‌కు రూ.2 కోట్లు వంతున కేటాయించేందుకు మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఇందులో కోటి రూపాయలు కార్పొరేటర్ నేరుగా ప్రతిపాదించిన పనులకు కేటాయిస్తారు. అవి పూర్తయ్యాక మరో కోటి రూపాయల పనులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనుమతితో కార్పొరేటర్ సూచించిన పనులకు కేటాయిస్తారు. ఈ నిధులను రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, కాలుష్య నియంత్రణ, వర్షపు నీటి కాల్వలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, పబ్లిక్ సౌకర్యాల అభివృద్ధి వంటి అత్యవసర పౌర సదుపాయాల మెరుగుదలకు వినియోగించాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. మొత్తానికి రానున్న రెండునెలల్లో దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేయవచ్చన్న మాట. జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లుండగా, కొన్ని డివిజన్లలో కార్పొరేటర్లు లేకపోవడం తెలిసిందే. రెండు టేబుల్ అజెండాలతో సహ 45 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీలకు సభ నివాళులర్పించింది. పాలకమండలి సభ్యులు గ్రూప్ ఫొటో దిగారు. కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ సభకు హాజరయ్యారు.
ఎక్స్ అఫీషియోలే ఎక్కువగా..
ఈసారి సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్ల కంటే ఎక్స్‌అఫీషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే ఎక్కువ సమయం మాట్లాడారు. సభ్యుల గలభాతో సభాధ్యక్షత వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలు మార్లు మార్షల్స్‌ను రప్పించారు. 150 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకొని వందేమాతరం గీతాలాపనతో సభ ప్రారంభించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. సభ కొద్దిసేపు వాయిదా వేశాక, వందేమాతరం గీతంతో పాటు రాష్ట్ర గీతమైన జయజయహే తెలంగాణ గీతాన్ని కూడా ఆలపించారు. ఎంఐఎం సభ్యుడు సోహైల్‌ఖాద్రి వందేమాతరం గీతాన్ని ఆక్షేపిస్తూ, మిగతా సభ్యులంతా లేచి ఆలపించినా, ఆయన మాత్రం నిలబడలేదు. ఈ సందర్భంగా దేశంలో ఉండాలంటే వందేమాతరం ఆలపించాలంటూ బీజేపీ సభ్యులు నినదించడంతో కాసేపు గలభా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో కొందరు కుర్చీలు, టేబుళ్లపైకి ఎక్కడంతో మేయర్ సీరియస్ అయ్యారు. మార్షల్స్‌ను రప్పించారు. అనంతరం వెనక్కి పంపించారు.
భూముల అమ్మకంపై వివాదం
● బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెబుతూ, ఇండస్ట్రియల్ భూముల అమ్మకం ప్రస్తావన రాగా, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దానికిది వేదిక కాదని, కావాలంటే ప్రత్యేక సమావేశంలో చర్చించవచ్చన్నారు. ఇది జీహెచ్‌ఎంసీకి సంబంధించిన అంశమే అని మరో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య వాదోపవాదాల సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యురాలు మన్నె కవిత వేలు చూపుతున్నారంటూ మేయర్ వారించారు. ఆమె క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యుడు బాబా ఫసియుద్దీన్ డిమాండ్ చేశారు.
● మరో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ సునీత సభకు, చైర్‌కు కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మేయర్ మండిపడ్డారు. మేయర్ కూడా కార్పొరేటర్లకు కూడా తగిన గౌరవమివ్వాలని సామల హేమ అన్నారు. మూడు నాలుగు నెలలకోమారు జరిగే సమావేశంలో కార్పొరేటర్లు మాట్లాడేందుకు అవకాశం లేకుండా ఎక్స్‌అఫీషియోలో ఎక్కువ సమయం తీసుకోవడం సమంజసం కాదని మేయర్ అన్నారు. మీకు సబ్జెక్ట్ లేకే ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నారని మేయర్ వ్యాఖ్యానించారు. కావాలంటే కార్పొరేటర్లకు అవకాశమిస్తానంటూ సునీతను మాట్లాడాల్సిందిగా కోరారు. గందరగోళాలు, వివాదాల తర్వాత పారిశుద్ధ్యం, డెబ్రిస్, కొన్ని ఏజెన్సీలకే టెండర్లు, క్రీడా సదుపాయాలు, తదితర అంశాల్లో ప్రజలు తీవ్ర సమస్యలెదుర్కొంటున్నారని సభ్యులు మండిపడ్డారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని మేయర్ ప్రారంభోపన్యాసంలో వివరించారు.
సమావేశం జరిగిందిలా..
సమయం అంశం
10.10: కార్పొరేటర్ల వద్ద ప్లకార్డుల తనిఖీ
11.04: సభలో ప్రవేశించిన మేయర్. సభ ప్రారంభం
11.08: మృతులకు సంతాపాలు
11.40: బేక్. గ్రూప్ ఫొటో షూట్
12.35: తిరిగి సభ ప్రారంభం.
వందేమాతరం
గీతాలాపనపై వివాదం. బ్రేక్
12.57: తిరిగి సభ ప్రారంభం
1–15: టీ బ్రేక్
1–25: తిరిగి ప్రారంభం
1–25: లంచ్ బ్రేక్
2.52: తిరిగి ప్రారంభం
4.30: టీ బ్రేక్
తిరిగి ప్రారంభమయ్యాక ముగిసేంత వరకు కొనసాగింది.


