మనమే గ్రేట్
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే అతిపెద్ద మహా నగరంగా హైదరాబాద్ అవతరించింది. రాష్ట్ర ప్రభుత్వం శివార్లలోని 27 మున్సిపాలిటీలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నిజాం సిటీతో మొదలైన భాగ్యనగరం 1,982.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 1.69 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో గ్రేటర్ విస్తరణ అనివార్యమైపోయింది. మన తర్వాతే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చైన్నె మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం 625 చ.కి.మీ., 1.45 కోట్ల జనాభాగా ఉన్న జీహెచ్‌ఎంసీ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా 40.17 చ.కి.మీ, కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల విస్తీర్ణం 1,317.73 చ.కి.మీ. జనాభా 20,16,978 మొత్తం కలిపి జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 1,982.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 1.69 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.
అభివృద్ధి విస్తరణ..
ప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాలలో.. ఆరు భారత్‌లోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు.. ప్రధాన ఆర్థిక, ఉద్యోగ కేంద్రాలుగా మారాయి. 146 కోట్ల జనాభా ఉన్న దేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీపడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు. జీహెచ్‌ఎంసీ విస్తరణతో ఆ మేరకు కొత్తగా విలీనమయ్యే మున్సిపాలిటీలలో పన్నులు పెరగక తప్పదు. అభివృద్ధి సమాంతరంగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలలో భూముల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు.
వృద్ధి ఎక్కడి నుంచి ఎక్కడికి..
1990 చివర్లో హైదరాబాద్‌లో ఫార్మాతో పాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీలు అప్‌గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశ్చిమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గ్రేటర్ నగరం వైపు దృష్టి మళ్లించాయి. బహుళ జాతి సంస్థలు, నైపుణ్య కార్మికులకు నగరం వేదికై ంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశ్చిమం వైపు నుంచి దక్షిణం వైపు విస్తరించింది.
దేశంలోనే అతిపెద్ద మహా నగరంగా హైదరాబాద్
దేశంలోని పలు మహా నగరాలివీ
మున్సిపల్ కార్పొరేషన్ జనాభా విస్తీర్ణం
(2011) (చ.కి.మీ)
బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 1,24,42,373 437
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ 1,10,34,555 1,397
బృహత్ బెంగళూరు మహానగర పాలిక 84,43,675 741
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 55,77,940 464
గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ 46,81,087 426
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ 44,96,694 206
సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ 44,62,002 462
పుణె మున్సిపల్ కార్పొరేషన్ 31,24,458 516
జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ 30,46,163 467
1,982.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అవతరణ
సుమారు 1.69 కోట్ల జనాభా
మన తర్వాతే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చైన్నె మున్సిపల్ కార్పొరేషన్లు


