అప్పటిదాకా స్పెషలాఫీసర్ పాలన
● జీహెచ్‌ఎంసీలో యూఎల్‌బీల విలీనం తర్వాత పునర్విభజన
● సర్కిళ్లు, వార్డుల ఏర్పాటు అనంతరమే.. ఎన్నికలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10తో ముగిసిపోనుంది. ఆలోగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని స్పష్టమైంది. ఓఆర్‌ఆర్ వరకున్న 27 యూఎల్‌బీల విలీన ప్రక్రియకు ప్రభుత్వం నిర్ణం తీసుకోవడంతో జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిశాక ఆ ప్రక్రియ మొదలుకానుంది. అనంతరం విలీనమయ్యే యూఎల్‌బీలతో జీహెచ్‌ఎంసీ మొత్తం ఒకటిగానే ఉంటుందా.. లేక అంతకంటే ఎక్కువ కార్పొరేషన్లుగా రూపాంతరం చెందనుందా? అన్నదానిపై ఇప్పటికై తే పూర్తి స్పష్టత లేదు. ప్రభుత్వమైతే రెండు నుంచి నాలుగు కార్పొరేషన్లుగా చేసే ఆలోచనను ఉపసంహరించుకోలేదని సమాచారం. ఎన్నికార్పొరేషన్లు అనే సంఖ్యపై మాత్రమే స్పష్టత రావాల్సి ఉంది. రెండు,మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తే ఎలా అనేదానిపై ఇప్పటికే డ్రాఫ్ట్‌లు సిద్ధమై ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికనుగుణంగా రెండు లేదా మూడు కార్పొరేషన్లు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే వాటికి ఎన్నికలు జరుగుతాయి. అప్పటిదాకా జీహెచ్‌ఎంసీ మొత్తానికి స్పెషలాఫీసర్ పాలనే సాగనుంది.జీహెచ్‌ఎంసీని ఎక్కువ కార్పొరేషన్లు చేస్తే సర్కిళ్లు, వార్డుల విభజన జనాభాకనుగుణంగా జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యేందుకు ఏడాది సమయం పడుతుందని సంబంధిత అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
నియోజకవర్గాలు పరిగణనలోకి..
కొత్తగా ఏర్పాటు కాబోయే కార్పొరేషన్లలో నియోజకవర్గాలు, వార్డుల సరిహద్దుల్లో వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భవిష్యత్‌లో కొత్త నియోజకవర్గాలు కూడా ఏర్పాటు కానున్నందున ఆ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇతర నగరాల్లోని పరిస్థితులు
మరోవైపు దేశంలోని ముంబై, ఢిల్లీ తదితర మహా నగరాల పరిస్థితులను, అక్కడి కార్పొరేషన్లు, వాటి పనితీరును కూడా పరిగణనలోకి తీసుకొని, తగిన అధ్యయనం చేసి హైదరాబాద్‌కు అనుగుణంగా ఇక్కడ కార్పొరేషన్లు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త కార్పొరేషన్లు కూడా ప్రస్తుతమున్న తరహాలోనే జోన్లు, సర్కిళ్లు, డివిజన్లుగా ఉంటాయా.. లేక వాటి స్వరూపం మారుతుందా అన్నది తెలియదు. ఈ నేపథ్యంలో, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున, అన్నీ పూర్తయి కొత్తపాలకమండళ్లు ఏర్పడ్డానికి ఎంతలేదన్నా ఏడాది పట్టే అవకాశం ఉంది.


