ఇక ‘మహా’ పరిధి ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్
● జీహెచ్‌ఎంసీ విస్తరణతో తగ్గనున్న హెచ్‌ఎండీఏ పరిధి
● 80 శాతం వరకు ఆదాయం తగ్గుముఖం
● ఔటర్ వెలుపల నగర విస్తరణకు ప్రణాళికలు
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న కోర్‌సిటీని జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించడంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యకలాపాలు ఇక ఔటర్ వెలుపలకు పరిమితం కానున్నాయి. ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ అనుమతులు, అభివృద్ధి కార్యక్రమాలు పరిమితం కానున్నాయి. ప్రస్తుతం నగరశివార్లలోని మున్సిపాలిటీల్లో ఐదు అంతస్తుల నుంచి చేపట్టే భవన నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు లభిస్తున్నాయి. ఈ మున్సిపాలిటీలన్నీ ఇక జీహెచ్‌ఎంసీలో భాగం కానున్న దృష్ట్యా అన్ని రకాల అనుమతులు జీహెచ్‌ఎంసీ నుంచి పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే విలీనమయ్యే మున్సిపాలిటీ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు ఇటీవల వరకు హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉన్న ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు జీహెచ్‌ఎంసీ, మరోవైపు ఫ్యూచర్‌సిటీ విస్తరణలతో హెచ్‌ఎండీఏ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.హెచ్‌ఎండీఏకు వచ్చే ఆదాయం కూడా తగ్గనుంది. వివిధ రకాల నిర్మాణాలపైన ప్రతి నెలా సుమారు రూ.100 కోట్ల వరకు లభిస్తుండగా, శివారు మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంతో ఈ ఆదాయం 80 శాతం వరకు తగ్గనుందని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


