ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే దండనే: సజ్జనర్
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ గురువారం కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగించినా, వారిపై దాడులకు దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. పోలీసు అధికారులు, ఉపాధ్యా యులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాదు బెదిరింపులకు దిగినా, దాడులు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహితలోని (బీఎన్‌ఎస్) 221, 132, 121(1) సెక్షన్ల ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామన్నారు. వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని చెప్పారు. ఇలా ఒక్కసారి కేసు నమోదైతే వారి భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉందని స్పష్టంచేశారు. పాస్‌పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఇబ్బందులు వస్తాయన్నారు. క్షణికావేశంలో తప్పు చేసి జీవితాంతం కుమిలిపోవద్దని సజ్జనర్ సూచించారు.


