టేబుల్‌అజెండా .. చాటుమాటు ‘దందా’ ?
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కానీ, సర్వసభ్య సమావేశాల్లో కానీ, అజెండా రూపొందించేనాటికి పొందుపరచని అత్యవసర పనులుంటే, ప్రజల అవసరాల దృష్ట్యా తప్పనిసరి అయితే టేబుల్ అజెండాగా సమావేశంలో అప్పటికప్పుడు ప్రవేశపెడతారు. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీకి మాత్రం ప్రతిసారీ కొన్ని అంశాలను సాధారణ అజెండాలో ఉంచకుండా టేబుల్ అజెండా పేరిట అప్పటికప్పుడు ఆమోదించడం పరిపాటిగా మారింది. ఇవి ఎవరి స్వప్రయోజనాల కోసమో అంతుపట్టదు. తాజాగా గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ అజెండాలో టేబుల్ అజెండాగా పొందుపరచి ఆమోదించిన అంశాల్లోని కొన్నింటిని పరిశీలిస్తే..
● జీహెచ్‌ఎంసీకి చెందిన హిల్‌లాక్ స్థలాన్ని జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ యజమాని భూమితో మార్చుకునేందుకు ఆమోదం.
● కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ ప్రాంగణంలోని గ్యాస్ సంస్థ లీజును మరో మూడు సంవత్సరాలకు పొడిగించేందుకు ఆమోదం.
● కాప్రా సర్కిల్‌లోని గెలీలియోనగర్ ఖాలీస్థలాన్ని స్పోర్ట్స్ ఎరీనాగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం.
● జీహెచ్‌ఎంసీ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కోసం సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసేందుకు ఆమోదం.
● ఆబిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని 56 సెల్లార్ దుకాణాల లీజుకు ఆమోదమని తొలుత పేర్కొన్నప్పటికీ, అనంతరం టెండరుగా మార్చారు.
● ఇవి ఎందుకు అత్యవసరమో, ఎవరికి అత్యవసరమో స్టాండింగ్ కమిటీ సభ్యులకే తెలియాలి. ఇవికాక ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉందంటే కాల్‌సెంటర్ సర్వర్ మౌలిక వసతుల్ని అప్‌గ్రేడ్ చేయడం, 50 సీట్లతో ఇన్‌బౌండ్ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయడం. అయితే ఈ పనులు ఎప్పుడో ముగిశాయి. ఇది తప్ప మిగతా వాటిల్లో ప్రజాసదుపాయాల కంటే ప్రైవేటు ప్రయోజనాలే కనిపించడం గుర్తించవచ్చు. నిబంధనల మేరకే చేసినా ఎందుకంత హడావుడి? సాధారణఅజెండాలో ఎందుకు చేర్చలేదో వారికే తెలియాలి.
అజెండాలో..
● ఇక సాధారణ అజెండాలోని అంశాల్లో మాసాబ్‌ట్యాంక్ చాచానెహ్రూపార్కులో స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్‌కు ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఆక్రమించుకున్నవారిపై తగిన చర్యలు తీసుకునే అంశాన్ని మాత్రం వాయిదా వేశారు.
● ఒక్కరికే జీహెచ్‌ఎంసీ ఆబిడ్స్ కార్యాలయం సెల్లార్‌లోని 56 దుకాణాల్ని కట్టబెట్టే పనుల్ని పక్కనపెట్టి, దాన్నే టేబుల్ అజెండాగా చేర్చి టెండర్లకు వెళ్తామన్నారు.
● హైడ్రాకు రూ. 20 కోట్లు ఇచ్చేందుకు కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ధ్రువీకరించే అంశాన్ని వాయిదా వేశారు. ఇక మిగతా వాటిల్లో ఇప్పటికే టెండర్లు పిలిచిన పనుల్ని ఆమోదం నిమిత్తం ఉంచారు.
● కొన్ని ప్రాజెక్టులకు భూసేకరణలు వంటివి ఉన్నాయి. మిగతా వాటిల్లో సనత్‌నగర్ లో జెన్ టెక్నాలజీస్ ఇండస్ట్రియల్ ఏరియా ఎదురుగా నీరు నిలవకుండా వరదనీటి కాలువ నిర్మాణానికి పరిపాలన అనుమతి, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను బకాయిల వడ్డీలపై రాయితీకి ‘వన్ టైమ్ స్కీమ్’ పై తదుపరి ఉత్తర్వులు జారీ చేసేందుకు కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి కమిటీ ఆమోదం, తదితరమైనవి ఉన్నాయి.
● సాధారణ అజెండాలో 18 అంశాలు, టేబుల్ అజెండాలో 6 అంశాలు ఆమోదించినట్లు పేర్కొన్నారు. సమావేశానికి మేయర్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, ఆయా విభాగాల ఉన్నతాధికారులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


