‘గాంధీ’లో అరుదైన శస్త్రచికిత్స
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అత్యంత అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించి ఏడేళ్ల బాలుడికి పునర్జన్మ ప్రసాదించారు. వివరాలను గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి, పీడియాట్రిక్ సర్జరీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ నాగార్జున వెల్లడించారు. మంచిర్యాల జిల్లా అకినేపల్లికి చెందిన అఖిల్ (7)కు మూడు నెలల వయసులోనే హెరిడిటరీ స్ఫెరోసైటోసిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించినా తీవ్రమైన రక్తహీనత, పచ్చకామెర్లు, స్ల్పిన్(ప్లీహం) పెరగడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారానికోసారి రక్తమార్పిడి చేస్తున్నారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఈ నెల 6న గాంధీ పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో అఖిల్‌ను చేర్చారు. ప్రొఫెసర్ నాగార్జున నేతృత్వంలో నిపుణులైన వైద్యులు అత్యంత క్లిష్టమైన ల్యాప్రొస్కోపిక్ స్ల్పినెక్టమీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి వ్యాధుల్లో రక్తస్రావం అధికంగా ఉంటుందని, కొన్నిసార్లు ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుందని ప్రొఫెసర్ నాగార్జున తెలిపారు. ల్యాప్రొస్కోపిక్ స్ల్పినెక్టమీ సర్జరీతో నొప్పి, ఇన్ఫెక్షన్లు, మచ్చలు తక్కువగా ఉంటాయని, రోగి త్వరగా కోలుకుంటారని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం ఇదే మొదటిసారి అని ప్రొఫెసర్ వాణి తెలిపారు. గాంధీఆస్పత్రి చరిత్రలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. సర్జరీని నిర్వహించిన వైద్యులు ప్రొఫెసర్ నాగార్జున, మనోజ్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, పవన్‌రావు, అశ్రితరెడ్డి, హర్ష, సాజిద్, అనస్తీషియా హెచ్‌ఓడీ ఆవుల మురళీధర్, బబిత, ఓటీ సిబ్బంది అరుణ, సువర్ణను వైద్యశాఖ ఉన్నతాధికారులు అభినందించారు. కోలుకున్న అఖిల్‌ను గురువారం డిశ్చార్జి చేశారు. తన కుమారుడికి పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల్ తండ్రి సురా రవి కృతజ్ఞతలు తెలిపారు.
మొదటిసారిగా ప్రభుత్వాస్పత్రిలో ల్యాప్రొస్కోపిక్ స్ల్పినెక్టమీ
ఏడేళ్ల బాలుడికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు


