‘ప్యాకెట్ ఆకారం చూసి మోసపోవద్దు’
సాక్షి, సిటీబ్యూరో: నూనె కొనుగోళ్ల సమయంలో ప్యాకెట్ ఆకారం చూసి వినియోగదారులు మోసపోవద్దని జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నూనె ప్యాకెట్ల కొనుగోళ్లలో అవగాహన లోపంతో ఎలా మోసపోతున్నారనే అంశంపై బంజారాహిల్స్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కంపెనీలు లీటరు ప్యాకెట్ ఆకారంలో తక్కువ నూనె విక్రయిస్తున్నాయని తెలిపారు. ఆయా కంపెనీలు నిబంధనల ప్రకారం వారి ఉత్పత్తులపై నూనె పరిమాణం వివరాలు ముద్రిస్తున్నాయని, వినియోగదారులు వాటిని పరిశీలించకుండా లీటరు అనే అపోహలో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. వినియోగదారుల అవగాహన కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రీడం ఆయిల్‌తోపాటు పలు కంపెనీలు ఒక లీటరు, 910 గ్రాముల నూనె ప్యాకెట్లను విక్రయిస్తున్నాయని, మరికొన్ని కంపెనీలు 800 మి.లీ. నూనె ప్యాకెట్లను లీటరు అన్న భ్రమ కలిగించే ఆకారంలో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయని తెలిపారు. కొన్ని కంపెనీల ప్యాకెట్లను వేయింగ్ మిషన్‌పై ఉంచి లైవ్ డెమో చూపించారు.


