సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య
హస్తినాపురం: పురుగుల మందుతాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. సాహెబ్‌నగర్‌కు చెందిన పారంద శ్రీకాంత్ (32) గతంలో హయత్‌నగర్‌కు చెందిన నలుగురితో రూ.2 లక్షలు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు శ్రీకాంత్‌పై ఒత్తిడి తేవడంతో పాటు నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తామని బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంటికి తాళాలు వేసి రోడ్డుమీదకు లాగుతామని ఫోన్‌లో బెదిరించారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీకాంత్ సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియోలో ‘తల్లిదండ్రులు నన్ను క్షమించండి... నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. నా చావుకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు.. ఇంటికొచ్చి పరువు తీస్తారనే భయంతోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నానని’ వీడియోను స్థానిక సాహెబ్‌నగర్ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. గురువారం శ్రీకాంత్ హరిహరపురం కాలనీలోని కప్పలచెరువు కట్టమీద మందులో విషం కలుపుకుని తాగి అక్కడే మృతి చెంది కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.


