గాంధీలో ఇంటి దొంగలు!?
మందుల సరఫరా ఏజెన్సీలతో కుమ్మక్కు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వాస్పత్రుల్లో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అందినకాడికి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అక్రమార్జనకు వక్రమార్గాలు వెతుకుతున్నారు. మందుల కొనుగోళ్లలో ప్రైవేటు ఏజన్సీలతో కుమ్మక్కవుతున్నారు. అవసరాలకు మించి మందులు ఆర్డర్ పెట్టడం, నకిలీ బిల్లులతో సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తరహా వ్యవహారం నగరంలోని గాంధీ ఆస్పత్రిలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఎవరు చేశారు? ఎలా చేశారంటూ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల విషయం అధికారులకు తెలిసినా.. సంకట స్థితిలో పడిపోయారు.
పెద్దమొత్తంలో మాత్రలు ఆర్డర్ చేసినట్లు..
ఆస్పత్రి అవసరాలకు సరిపడా మందుల సరఫరా కోసం ఏజన్సీలను ఎంపిక చేస్తారు. అత్యవసర మందులు, ఏ రకం మాత్రలు, సిరప్‌లు, ఇతరాలు ఎన్ని అవసరమో.. వాటిని సరఫరా చేయాలని ఆస్పత్రి నుంచి ఇండెంట్ పెడతారు. దీనికి అనుగుణంగా ఏజెన్సీ నుంచి సరఫరా జరుగుతోంది. ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆస్పత్రి సిబ్బందికి, సరఫరా ఏజన్సీదారులకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో ఏం చేసినా ఎవరికి తెలియదనుకున్నారో ఏమో.. పెద్ద మొత్తంలో మందులు ఆర్డర్ చేసినట్లు చూపించారు. ఉదాహరణకు ఆస్పత్రి అవసరాలకు వెయ్యి మాత్రలు సరిపోతాయంటే 20 వేలు ఇండెంట్ పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ఏజెన్సీలు సుమారు రూ.80 లక్షలకుపైగా బకాయిలు చూపిస్తున్నారని తెలుస్తోంది.
అత్యవసర మందులకు తంటాలు
ఇదిలా ఉంటే.. కొనుగోలు చేసిన మందుల స్టాక్‌లోనూ తేడాలున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వ్యక్తికి 5 నుంచి 10 మాత్రలు ఇస్తే సరిపోయేదానికి 50 నుంచి 60 మాత్రలు ఇచ్చినట్లు నివేదికల్లో చూపిస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఏజెన్సీలతో కుమ్మకై ్క నకిలీ బిల్లులతో సొమ్ము పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మందుల కొనుగోళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజన్సీలకు అధిక మొత్తంలో బకాయిలు ఉన్నాయంటూ కొత్త ఇండెంట్లను సరఫరా చేయడానికి ససేమిరా అంటున్నారు. పాత బకాయిలు చెల్లిస్తే, కొత్త ఇండెంట్లను సరఫరా చేస్తామని తెగేసి చెబుతున్నారని తెలుస్తోంది. దీంతో అత్యవసర మందుల కొనుగోళ్లు అధికారులకు తలనొప్పి వ్యవహారంగా మారుతోంది.
ఆస్పత్రి అవసరాలకు మించి ఇండెంట్
నకిలీ బిల్లులతో రూ.లక్షల్లో స్వాహా
రోగులకు భారీ సంఖ్యలో మాత్రలు ఇచ్చినట్లు లెక్కలు


