కొందా‘మంటే’..
భగ్గుమంటున్న కూరగాయల ధరలు
సాక్షి, సిటీబ్యూరో: ‘కొనబోతే కొరివి’ అంటే ఇదేనేమో! కూరగాయల ధరలు భగ్గున మండిపోతున్నాయి. గతంలో లేని విధంగా నవంబర్ నెలలో ధరలు భారీ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా బీన్స్ రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.150–160 పలుతోంది. దీంతో పాటు చిక్కుడు, బీరకాయ ధరలు కూడా సెంచరీ దాటాయి. పైగా మార్కెట్‌కు డిమాండ్‌కు తగ్గట్టుగా కూరగాయలు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. నవంబర్ మొదటి వారం వరకు వర్షాలు కురవడంతో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రభావం దిగుబడిపై పడి నగరానికి దిగుమతులు భారీగా తగ్గి ఈ పరిస్థితి ఏర్పడింది.
పంటలపై వర్షాల ప్రభావం..
సాధారణంగా నవంబర్‌లో నగర మార్కెట్లకు సుమారు 3 వేల నుంచి 3.5 వేల టన్నుల కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం 2.3– 2.5 వేల టన్నులు మాత్రమే దిగుమతి అవుతు న్నట్లు మార్కెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో తెలంగాణ జిల్లాల్లో ఉత్పత్తులు తగ్గితే ప క్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతులు పెరిగేవి. ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో నగరానికి దిగుమతులు బాగా పడిపోయాయి. వర్షాలతో కూరగాయల సాగుకు తీవ్ర నష్టం జరగడంతోనే మార్కెట్ కూరగాయల దిగుమతులు తగ్గినట్టు మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
బీన్స్ బిరబిరా.. ట‘మోత’
ప్రత్యేకంగా బీన్స్ దిగుమతులు తగ్గడంతో హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ రూ.130–135 వరకు పలికింది. లోకల్ బీన్స్ రాక చిక్‌బల్లాపూర్‌తో పాటు కర్ణాటక నుంచి బీన్స్ దిగుమతి కావడంతో దీని ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు చెప్పారు. టమాటా ఈ సీజన్‌లో గత నెల వరకు కిలో రూ.20 లోపే ఉంది. కానీ ఇటీవల బహిరంగ మార్కెట్‌లో రూ.40–60కు చేరింది. ప్రతిరోజూ నగర మార్కెట్లకు దాదాపు 100కు పైగా లారీల టమాటా దిగుమతి అయ్యేది. ప్రస్తుతం 50–60 లారీల టమాటా వస్తోందని వారు పేర్కొన్నారు.
బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు ఇలా..
కిలో రూ.లలో
టమాటా 40-60
బెండకాయ 100-120
బీన్స్ 120-150
బీరకాయ 120
చిక్కుడు 120
వంకాయ 60-80
దొండ 80-100
క్యాబేజీ 80
పచ్చిమిర్చి 80
కాకర 80
బీన్స్ రూ.150.. చిక్కుడు రూ.120
టమాటా రూ.60.. పచ్చిమిర్చి రూ.80
కూరగాయల సాగుపై వర్షాల ప్రభావం
నిత్యం 3.5 వేల టన్నులు అవసరం
2.5 వేల టన్నులు మాత్రమే దిగుమతి
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు


