22 నుంచి రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’
కంటోన్మెంట్: ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్ ఎడిషన్‌కు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వేదిక కానుంది. ఈ నెల 21న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 22 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి నిలయం, కేంద్ర సంస్కృతి, టెక్స్‌టైల్స్, టూరిజం మంత్రిత్వ శాఖల ప్రతినిధులు వివరాలు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్, మూడు మంత్రిత్వ శాఖలతో కలిసి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ మహోత్సవ్‌లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్ అండ్ డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు పాల్గొననున్నారు. సందర్శకులకు ప్రవేశం ఉచితం. అధికారిక టికెట్ బుకింగ్ పోర్టల్ ద్వారా లేదా ఈవెంట్ పోస్టర్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి నిలయం ఆవరణలోనూ నేరుగా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రతి రోజు 20 వేల నుంచి 25 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశమున్నందున ఆ మేరకు పార్కింగ్ ఇతరత్రా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజనీ ప్రియ, వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు స్వాతి, కుమారీ సందేశ్, ఆస్తా కర్నేకర్ తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది రోజుల పాటు సాగనున్న కార్యక్రమాలు
21న ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము


